Mutton Keema Curry : మ‌టన్ కీమా క‌ర్రీని ఒక్క‌సారి ఇలా చేయండి.. రుచి అద‌ర‌హో అంటారు..

Mutton Keema Curry : మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన‌న్ని ప్రోటీన్ల‌ను అందించే ఆహారాల్లో మ‌ట‌న్ కూడా ఒక‌టి. మాంసాహార ప్రియుల‌కు దీని రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. మ‌ట‌న్ తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. ఈ మ‌ట‌న్ ను కీమాగా చేసి కూడా వండుకుని తింటూ ఉంటాం. మ‌ట‌న్ కీమా క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఈ మ‌ట‌న్ కీమా క‌ర్రీని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. మొద‌టిసారి చేసేవారు, వంటరాని వారు దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా, సులువుగా, చ‌క్క‌టి వాస‌న వ‌చ్చేలా ఈ మ‌ట‌న్ కీమా కర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌ట‌న్ కీమా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మ‌ట‌న్ కీమా – 300 గ్రా., ఉప్పు – త‌గినంత‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండున్న‌ర‌ టీ స్పూన్స్, ప‌సుపు – అర‌ టీ స్పూన్, కారం – 3 టీ స్పూన్స్, పెరుగు – పావు క‌ప్పు, బ‌ట‌ర్ – 2 టీ స్పూన్స్, నూనె – 2 టీ స్పూన్స్, త‌రిగిన ఉల్లిపాయ – 1, చిన్న‌గా త‌రిగిన ట‌మాటాలు – 3, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Mutton Keema Curry recipe in telugu tasty one how to cook
Mutton Keema Curry

మ‌సాలా పొడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ధ‌నియాలు – 2 టీ స్పూన్స్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ల‌వంగాలు – 4, మిరియాలు – పావు టీ స్పూన్, యాలకులు – 3, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ఎండుమిర్చి – 3, బిర్యానీ ఆకులు – 2.

మ‌ట‌న్ కీమా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా మ‌ట‌న్ కీమాను శుభ్రంగా క‌డిగి నీళ్లు లేకుండా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత అందులో పావు టీ స్పూన్ ప‌సుపు, 2 టీ స్పూన్ల అల్లం, 2 టీ స్పూన్ల కారం, ఒక టీ స్పూన్ ఉప్పు, పెరుగు వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి అర గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో మ‌సాలా పొడికి కావ‌ల్సిన ప‌దార్థాలు వేసి చ‌క్క‌టి వాస‌న వ‌చ్చే వ‌ర‌కు చిన్న మంట‌పై వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ దినుసులు చ‌ల్లారిన త‌రువాత జార్ లోకి తీసుకుని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత కుక్క‌ర్ లో బ‌ట‌ర్, నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత ట‌మాట ముక్క‌లు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ప‌సుపు వేసి క‌ల‌పాలి. ఈ ట‌మాట ముక్క‌ల‌ను మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. ట‌మాట ముక్క‌లు వేగిన త‌రువాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న కీమాను వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి కీమాను నూనెలో చ‌క్క‌గా వేయించాలి.

ఇలా ప‌ది నిమిషాల పాటు వేయించిన త‌రువాత త‌గినంత ఉప్పు, జీల‌క‌ర్ర పొడి, గ‌రం మ‌సాలా, మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పొడి వేసి రెండు నిమిషాల పాటు బాగా వేయించాలి. త‌రువాత ఒక గ్లాస్ లేదా త‌గిన‌న్ని నీళ్లు పోసి క‌లపాలి. ఇప్పుడు కుక్క‌ర్ పై మూత పెట్టి 5 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు మ‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత మూత తీసి కొత్తిమీర వేసి క‌లపాలి. కీమాలో ఎక్కువ‌గా నీళ్లు ఉంటే ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు మ‌రికొద్ది సేపు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మ‌ట‌న్ కీమా క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, పుల్కా, రోటి వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా మ‌ట‌న్ కీమా క‌ర్రీని త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts