Mutton Paya : మటన్ పాయ.. నాన్ వెజ్ ప్రియులకు దీని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. మటన్ పాయను తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు ఈ పాయను తినడం వల్ల శరీరానికి తగినంత క్యాల్షియం లభించి నొప్పులు తగ్గే అవకాశం కూడా ఉంది. ఈ మటన్ పాయను వంటరాని వారు తయారు చేసుకునేంత సులభంగా, రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్నవివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మటన్ పాయ తయారీకి కావల్సిన పదార్థాలు..
పాయ – 300 గ్రా., నూనె – అర కప్పు, పెద్ద ఉల్లిపాయలు – 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, గరం మసాలా – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, నీళ్లు – ఒక లీటర్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, పచ్చిమిర్చి తరుగు – ఒక టీ స్పూన్, నిమ్మ రసం – అర చెక్క నిమ్మకాయ.
మసాలా దినుసులు..
దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, యాలకులు – 4, లవంగాలు – 5, జీలకర్ర – ఒక టీ స్పూన్, బిర్యానీ ఆకు – 1, మిరియాలు – పావు టీ స్పూన్.
మటన్ పాయ తయారీ విధానం..
ముందుగా ఒక కుక్కర్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మసాలా దినుసులను వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయలను పేస్ట్ గా చేసి వేసుకోవాలి. ఈ పేస్ట్ ను ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించాలి. తరువాత పాయ వేసి కలపాలి. దీనిలో 200 ఎమ్ ఎల్ నీళ్లు వేసి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. తరువాత అర లీటర్ నీళ్లు పోసి మూత పెట్టి 4 విజిల్స్ చిన్న మంటపై, 2 విజిల్స్ మధ్యస్థ మంటపై వచ్చే వరకు ఉడికించాలి.
ఇలా ఉడికించిన తరువాత మూత తీసి మరలా స్టవ్ ఆన్ చేసి మిగిలిన నీళ్లను పోసి పొంగు వచ్చే వరకు ఉడికించాలి. తరువాత కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగు, నిమ్మరసం వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పాయ వేడిగా ఉన్నప్పుడు పలుచగా ఉన్నా చల్లారిన తరువాత గట్టిగా అవుతుంది. ఇలా చేయడం వల్ల నోట్లో వేసుకుంటే కరిగిపోయే మటన్ పాచ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, దోశ, పూరీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా మటన్ పాయను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.