Mysore Masala Dosa : ఉదయం పూట అల్పాహారంగా చేసే దోశలను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిని ఇంట్లో చాలా సులువుగా తయారు చేస్తూ ఉంటాం. అలాగే మనకు బయట హోటల్స్ లో వివిధ రుచుల్లో వివిధ రకాల దోశలు దొరుకుతాయి. మనకు బయట ఎక్కువగా లభించే దోశల్లో మైసూర్ మసాలా దోశ కూడా ఒకటి. ఈ దోశ చాలా రుచిగా ఉంటుంది. అచ్చం బయట లభించే విధంగా ఉండే ఈ మైసూర్ మసాలా దోశను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. చాలా సులభంగా మైసూర్ మసాలా దోశను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మైసూర్ మసాలా దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
మినపప్పు – ఒక కప్పు, బియ్యం – 3 కప్పులు, మెంతులు – 2 టీ స్పూన్స్, శనగపప్పు – 2 టేబుల్ స్పూన్స్, అటుకులు – అర కప్పు, చల్లటి నీళ్లు – తగినన్ని, ఉప్పు – తగినంత.
ఎర్ర చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, నువ్వులు – 2 టీ స్పూన్స్, తరిగిన ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు, కరివేపాకు – ఒక రెబ్బ, వెల్లుల్లి రెబ్బలు – 5, నానబెట్టిన ఎండుమిర్చి – 4, చింత పండు – కొద్దిగా, పుట్నాల పప్పు – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత.
ఆలూ మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన బంగాళాదుంపలు – 3 (మధ్యస్థంగా ఉన్నవి), నూనె – 2 టేబుల్ స్పూన్స్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెబ్బ, ఎండు మిర్చి – 1, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు, పచ్చిమిర్చి – 2, అల్లం – ఒక ఇంచు ముక్క, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నిమ్మరసం – ఒక టీ స్పూన్.
మైసూర్ మసాలా దోశ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మినపప్పును తీసుకోవాలి. అందులో బియ్యం, మెంతులు, శనగపప్పు వేసి నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. అటుకులను కూడా పిండి పట్టడానికి అరగంట ముందు నానబెట్టాలి. తరువాత ఒక జార్ లో నానబెట్టిన మినపప్పుతో పాటు అటుకులను కూడా వేసి తగినన్ని చల్లటి నీటిని పోసి మెత్తగా పిండి పట్టుకోవాలి. ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని మూ పెట్టి 6 నుండి 8 గంటల పాటు పిండిని పులియబెట్టాలి. పిండి పులిసిన తరువాత దీనిలో తగినంత ఉప్పును వేసి బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఎర్ర చట్నీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక నువ్వులను వేసి దోరగా వేయించాలి.
తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి కూడా వేసి 2 నిమిషాల పాటు వేయించి ఒక జార్ లోకి తీసుకోవాలి. అందులోనే పుట్నాల పప్పు, చింతపండు, ఉప్పు వేసి ముందుగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆలూ మసాలాను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత అల్లం ముక్కను, పచ్చిమిర్చిని కచ్చా పచ్చాగా దంచి ఆ మిశ్రమాన్ని వేసుకోవాలి.
ఇది కూడా వేగిన తరువాత పసుపు వేసి కలపాలి. ఇప్పుడు ఉడికించిన బంగాళాదుంపలను మెత్తగా చేసి వేసి అంతా కలిసేలా బాగా కలపాలి. తరువాత ఉప్పు, నిమ్మరసం వేసి కలపాలి. చివరగా కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీ పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక తగినంత పిండిని తీసుకుని పలుచగా దోవలాగా వేసుకోవాలి. తరువాత దానిపై నూనె వేసి కాల్చుకోవాలి. దోశ కొద్దిగా కాలిన తరువాత దాని మీద ఎర్ర చట్రీని వేసి దోశ అంతా వచ్చేలా స్పూన్ తో అనాలి.
తరువాత దానిపై ఉల్లి తరుగును, కొత్తిమీరను చల్లి ముందుగా తయారు చేసుకున్న అలూ మసాలా మిశ్రమాన్ని దోశ మధ్యలో ఉంచాలి. దోశ ఎర్రగా కాలిన తరువాత ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల బయట హోటల్స్ లో లభించే విధంగా ఎంతో రుచిగా కరకరలాడుతూ ఉండే మైసూర్ మసాలా దోశ తయారవుతుంది. దీనిని పల్లి చట్నీ, టమాట చట్నీ వంటి వాటితో కలిపి తినవచ్చు. ఈ మైసూర్ మసాలా దోశను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.