Nethi Beerakaya Pachadi : మనం నేతి బీరకాయను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మామూలు బీరకాయ వలె ఇది కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నేతి బీరకాయతో ఎక్కువగా కూరలను తయారు చేస్తూ ఉంటాం. కేవలం కూరలే కాకుండా దీనితో మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. నేతి బీరకాయ పచ్చడి లొట్టలేసుకుంటూ తినేంత రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. రుచిగా, సులువుగా నేతిబీరకాయతో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నేతి బీరకాయ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన నేతి బీరకాయ – 1 ( మధ్యస్థంగా ఉన్నది), నూనె – ఒక టేబుల్ స్పూన్, పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి – 10 లేదా తగినన్ని, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన టమాట – 1, చింతపండు – చిన్న నిమ్మకాయంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు – 10, జీలకర్ర – ఒక టీ స్పూన్.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్.
నేతి బీరకాయ పచ్చడి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పల్లీలు వేసి వేయించాలి. తరువాత ఇందులోనే ధనియాలు వేసి వేయించాలి. తరువాత వీటని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు అదే కళాయిలో బీరకాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత ఇందులో టమాట ముక్కలు, చింతపండు, కొత్తిమీర వేసి కలపాలి. నీరంతా పోయి దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు జార్ లో వేయించిన పల్లీలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత వేయించిన బీరకాయ ముక్కలు వేసి బరకగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి.
తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత దీనిని ముందుగా తయారు చేసుకున్న పచ్చడిలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే నేతి బీరకాయ పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. నేతి బీరకాయతో కూరలే కాకుండా ఇలా పచ్చడిని చేసుకుని తినవచ్చు. ఈ పచ్చడిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.