Eating Sitting On Floor : ప్రస్తుత కాలంలో మారిన నాగరికత కారణంగా చాలా మంది డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అయితే ఏ నాగరికతైనా మనకు సౌకర్యాని, ఆరోగ్యాన్ని ఇవ్వాలి కానీ అనారోగ్య సమస్యలను ఇవ్వకూడదు. చాలా మంది మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యల కారణంగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటూ ఉంటారు. కానీ ఇలా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినడం వల్ల మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యలు ఇంకా అధికమవుతాయని నిపుణులు చెబుతున్నారు. మన సాంప్రదాయాల ప్రకారం కింద కూర్చొని తినడమే అన్ని విధాలా మంచిదని వారు చెబుతున్నారు. అసలు కింద కూర్చొని ఎందుకు భోజనం చేయాలి.. ఇలా భోజనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు మన ఇండ్లల్లో డైనింగ్ టేబుల్స్యుండేవి కాదు.
అందరూ చక్కగా కింద కూర్చొని లేదా పీటల మీద కూర్చొని భోజనం చేసేవారు. ప్రస్తుత కాలంలో కూర్చీలో కూర్చొని నడుము వంచకుండా తినేస్తున్నారు. ఇలా కుర్చీలో కూర్చొని భోజనం చేయడం వల్ల నడుము చుట్టు కొవ్వు పేరుకుపోతుంది. పొట్ట పెరుగుతుంది. అలాగే అధిక బరువు బారిన కూడా పడుతుంటారు. అధిక బరువు కారణంగా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తూ ఉంటాయి. కింద కూర్చొని భోజనం చేయడం వల్ల పొట్ట పెరగకుండా ఉంటుంది. అలాగే నేల మీద కూర్చొని భోజనం చేయడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా తెలియజేసారు. నేల మీద కూర్చొని భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అలాగే మనం తినే ప్లేట్ ను కూడా కింద పెట్టుకుని తింటూ ఉంటాం. దీని వల్ల మనం ముందుకు, వెనక్కి వంగాల్సి వస్తుంది.
దీని వల్ల పొట్టలో ఉండే కండరాలు ఉత్తేజంగా పని చేస్తాయి. తద్వారా మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. బరువు కూడా పెరగకుండా ఉంటారు. ఇలా కూర్చొని తినడం వల్ల మనం ఏం తింటున్నామో తెలుసుకుని తింటూ ఉంటాం. దీంతో మనం తినకూడని ఆహారాలను తక్కువగా తినడం , అలాగే మనం తినే ఆహారాల రుచిని ఆస్వాదించడం వంటివి చేస్తూ ఉంటాం. కింద కూర్చొని భోజనం చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. బీపీ అదుపులో ఉంటుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. గుండెకు రక్తప్రసరణ మెరుగుపడుతుంది. నేల మీద కూర్చొని భోజనం చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అలాగే కింద కూర్చొని భోజనం చేయడం వల్ల శరీర భంగిమ సరిగ్గా ఉంటుంది. దీంతో వెన్ను సమస్యలు రాకుండా ఉంటాయి.
అదే విధంగా పొట్టలో గ్యాస్ సమస్య కూడా తలెత్తకుండా ఉంటుంది. మనం కింద కూర్చోని భోజనం చేయడానికి రెండు కాళ్లు మడిచి నిటారుగా కూర్చుంటాము. దీనిని సుఖాసనం, అర్థ పద్మాసనం అని అంటారు. జీర్ణక్రియ మెరుగుపడడానికి, మానసిక ఒత్తిడి తగ్గడానికి, వెన్ను సమస్యలు తగ్గడానికి ఈ రెండు ఆసనాలు చక్కగా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే నొప్పులు తగ్గుతాయి. అలాగే కింద కూర్చొని భోజనం చేసేటప్పుడు ఒకరు తినాలి ఒకరు వడ్డించాలి లేదా అందరూ కూర్చొని భోజనం చేయాలి ఇలా చేయడం వల్ల కుటుంబంలో బంధాలు మరింత బలపడతాయి. కనుక కింద కూర్చొని భోజనం చేయడమే అన్నింటి కంటే ఉత్తమమైనదని మన పెద్దలు చెప్పిన ఆచారాన్ని మనం కూడా పాటించాలని నిపుణులు చెబుతున్నారు.