Netthalla Iguru : చేపలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. మనం పచ్చి చేపలతో పాటు ఎండు చేపలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మనం ఆహారంగా తీసుకునే వివిధ రకాల చేపల్లో నెత్తళ్ళు కూడా ఒకటి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. నెత్తళ్ళతో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. కూర, పులుసుతో పాటు వీటితో మనం ఎంతో రుచిగా ఉండే ఇగురును కూడా తయారు చేసుకోవచ్చు. వాసన లేకుండా చక్కగా రుచిగా మనం ఈ ఇగురును వండుకోవచ్చు. ఎవరైనా కూడా వీటితో సులభంగా ఇగురును తయారు చేసుకోవచ్చు. వాసన లేకుండా రుచిగా నెత్తళ్ళతో ఇగురును ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నెత్తళ్ళ ఇగురు తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎండు నెత్తళ్ళు – 100 గ్రా., నూనె – 4 టేబుల్ స్పూన్స్, ఆవాలు – ఒక టీ స్పూన్, వెల్లుల్లి తరుగు – 2 టీ స్పూన్స్, కరివేపాకు – రెండు రెమ్మలు, చిన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పెద్ద టమాటాలు – 2, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, కారం – రెండు టీ స్పూన్స్, నీళ్లు – 1/3 కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
నెత్తళ్ళ ఇగురు తయారీ విధానం..
ముందుగా కళాయిలో నెత్తళ్ళను వేసి వేయించాలి. వీటిని 5 నుండి 6 నిమిషాల పాటు కలుపుతూ వేయించిన తరువాత వేడి నీటిలో వేసి కలుపుతూ కడగాలి. నీళ్లు తెల్లగా వచ్చే వరకు కడిగిన తరువాత వాటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు వేసి వేయించాలి. తరువాత వెల్లుల్లి తరుగు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ మెత్తబడే వరకు వేయించిన తరువాత టమాట ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి టమాట ముక్కలను మెత్తగా మగ్గించాలి.
టమాట ముక్కలు మెత్తగా ఉడికి నూనె పైకి తేలిన తరువాత కారం, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలిపి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. నూనె పైకి తేలిన తరువాత శుభ్రం చేసుకున్న నెత్తళ్ళను వేసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే నెత్తళ్ళ ఇగురు తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల నెత్తళ్ళ ఇగురు వాసన లేకుండా చక్కగా రుచిగా ఉంటుంది.