Onion Bajji : మనకు సాయంత్రం సమయాల్లో బండ్ల మీద లభించే చిరుతిళ్లల్లో బజ్జీ కూడా ఒకటి. బజ్జీ కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అలాగే మనకు బయట వివిధ రుచుల్లో ఈ బజ్జీలు లభిస్తూ ఉంటాయి. మనకు విరివిరిగా లభించే బజ్జీ వెరైటీలలో ఆనియన్ బజ్జీ కూడా ఒకటి. ఉల్లిపాయలు చల్లి చేసే ఈ బజ్జీ కారం కారంగా, పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. ఈ బజ్జీని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా ఉండే ఈ ఆనియన్ బజ్జీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆనియన్ బజ్జీ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – పావు కిలో, బజ్జీ మిర్చి – 10, వంటసోడా – అర టీ స్పూన్, వాము – ఒక టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, గరం మసాలా – అర టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, కారం- అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, నిమ్మకాయ – అర చెక్క, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఆనియన్ బజ్జీ తయారీ విధానం..
ముందుగా వామును ఒక గిన్నెలో తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, ఒక టీ స్పూన్ శనగపిండి వేసి కలపాలి. తరువాత మిర్చికి నిలువుగా గాటు పెట్టుకోవాలి. తరువాత ఇందులో ఉండే గింజలను తీసేయాలి. తరువాత ఇందులో ముందుగా తయారు చేసుకున్న వామును ఉంచాలి. ఇలా అన్నింటిని తయారు చేసిన తరువాత గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, వంటసోడా వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి పిండిని కలుపుకోవాలి. తరువాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వేడి నూనె వేసి కలపాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పిండిలో మిర్చిని ముంచాలి.
మిర్చికి పిండిని పట్టించిన తరువాత మిర్చిని గిన్నె అంచుకు రాస్తూ నూనెలో వేసుకోవాలి. ఇలా బజ్జీలను వేసుకున్న తరువాత వీటిని మధ్యస్థ మంటపై వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ధనియాల పొడి, కారం, గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు ముందుగా కాల్చుకున్న బజ్జీని తీసుకుని మధ్యలోకి కట్ చేసుకోవాలి. తరువాత అందులో ఉల్లిపాయ ముక్కలను ఉంచి వాటిపైస నిమ్మరసం పిండాలి. ఇలా చేసుకోవడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆనియన్ బజ్జీ తయారవుతుంది. వీటిని లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.