Onion Chutney : ఉల్లిపాయ ప‌చ్చ‌డి ఎంతో రుచిక‌రం.. ఆరోగ్య‌క‌రం..!

Onion Chutney : మ‌నం వంటింట్లో అనేక ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వంట‌ల త‌యారీలో క‌చ్చితంగా ఉప‌యోగించే వాటిల్లో ఉల్లిపాయ కూడా ఒక‌టి. చాలా మంది ఉల్లిపాయ‌ను వేయ‌కుండా వంట‌ల‌ను త‌యారు చేయ‌లేరు. ఇవి వంట‌ల రుచిని పెంచ‌డ‌మే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు దృఢంగా ఉంటాయి. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. జీర్ణ శ‌క్తి మెరుగుప‌డుతుంది.

ఉల్లిపాయ‌ల‌ను వంట‌ల‌లో ఉప‌యోగించ‌డ‌మే కాకుండా వీటితో ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఉల్లిపాయ ప‌చ్చ‌డిని, నెయ్యిని వేసుకుని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. చాలా సులువుగా మ‌నం ఈ ప‌చ్చ‌డిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఉల్లిపాయ ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Onion Chutney very tasty and healthy make in this way
Onion Chutney

ఉల్లిపాయ ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పెద్ద‌గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 3 (మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), నూనె – ఒక టేబుల్ స్పూన్, శ‌న‌గ ప‌ప్పు – ఒక టీ స్పూన్, మిన‌ప ప‌ప్పు – ఒక టీ స్పూన్, ఎండు మిర‌ప‌కాయ‌లు – 10 నుండి 12, క‌రివేపాకు – గుప్పెడు, ధ‌నియాలు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, చింత‌పండు – 10 గ్రాములు, ప‌సుపు – పావు టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు – 3, ఉప్పు – త‌గినంత‌, నీళ్లు – కొద్దిగా.

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, మిన‌ప ప‌ప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఎండు మిర‌ప‌కాయ‌లు – 2, క‌రివేపాకు – ఒక రెబ్బ‌.

ఉల్లిపాయ ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో నూనె వేసి నూనె కాగిన త‌రువాత శ‌న‌గ ప‌ప్పును, మిన‌ప ప‌ప్పును, ఎండు మిర‌ప‌కాయ‌ల‌ను, క‌రివేపాకును వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ధ‌నియాల‌ను, జీల‌క‌ర్ర‌ను వేసి వేయించి ఒక జార్ లోకి తీసుకోవాలి. అదే క‌ళాయిలో ఉల్లిపాయ ముక్క‌ల‌ను వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత చింత‌పండును, ప‌సుపును, కొత్తిమీర‌ను వేసి క‌లిపి రెండు నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత మిక్సీ జార్ లో వేసిన వాట‌న్నింటినీ మెత్త‌ని పొడిలా చేసుకోవాలి.

ఇలా చేసిన త‌రువాత ఇందులోనే వేయించిన ఉల్లిపాయ‌లను, వెల్లుల్లి రెబ్బ‌ల‌ను, ఉప్పును వేసి మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్ల‌ను పోసి మ‌ర‌లా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి నూనె కాగిన త‌రువాత తాళింపు పదార్థాల‌ను వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు వేగిన తరువాత ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న ఉల్లిపాయ మిశ్ర‌మాన్ని వేసి క‌లిపి 2 నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. ఈ ప‌చ్చ‌డిని అన్నం, దోశ‌, ఊత‌ప్పం వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఉల్లిపాయ‌ల‌ను కేవ‌లం కూర‌ల‌లోనే కాకుండా ఇలా ప‌చ్చ‌డిగా కూడా చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts