Onion Curry : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే నానుడి మనకు ఎంతో కాలం నుండి వాడుకలో ఉంది. ఈ నానుడి బట్టే ఉల్లిపాయ మనకు ఎంత మేలు చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. అందుకు అనుగుణంగానే ఉల్లిపాయను మనం వంటింట్లో విరివిరిగా ఉపయోగిస్తూ ఉన్నాం. ఇతర వంటకాల్లో వాడడంతో పాటు ఉల్లిపాయలతో మనం ఎంతో రుచిగా ఉండే కూరను కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ ఉల్లిపాయ కూర చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు, బ్యాచిలర్స్ కూడా ఈ కూరును చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయలతో రుచిగా కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్న ఉల్లిపాయలు – ఒక కప్పు, బియ్యం – ఒక టేబుల్ స్పూన్, మిరియాలు – అర టీ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, ఇంగువ – చిటికెడు, ఎండు మిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన టమాటాలు – 2, కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, నానబెట్టిన చింతపండు – చిన్న నిమ్మకాయంత, నీళ్లు – ఒక గ్లాస్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఉల్లిపాయ కూర తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో బియ్యం, మిరియాలు, మెంతులు, జీలకర్ర వేసి చిన్న మంటపై దోరగా వేయించాలి. తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయలను వేసి వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత టమాట ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి కలపాలి. ఈ టమాట ముక్కలను మెత్తగా అయ్యే వరకు వేయించాలి. టమాట ముక్కలు మెత్తగా అయిన తరువాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించాలి. తరువాత చింతపండు రసం, నీళ్లు వేసి కలపాలి. దీనిని రెండు నిమిషాల పాటు ఉడికించిన తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న పొడిని ఒకటిన్నర టేబుల్ స్పూన్ మోతాదులో వేసి కలపాలి.
తరువాత ఒక చిన్న బెల్లం ముక్కను వేసి కలపాలి. దీనిని దగ్గర పడే వరకు మరో నాలుగు నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ కూర తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. చిన్న ఉల్లిపాయలు లేని వారు సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవచ్చు. సమయం తక్కువగా ఉన్నప్పుడు, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా ఉల్లిపాయలతో ఎంతో రుచిగా ఉండే కూరను తయారు చేసుకుని తినవచ్చు. ఈ కూరను అందరూ ఇష్టంగా తింటారు.