Onions Fry : మనం కూరగాయలను ఉపయోగించి రకరకాల కూరలను తయారు చేస్తూ ఉంటాం. కూరగాయలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. కానీ ఎటువంటి కూరగాయను వాడకుండా కూడా మనం చాలా సులభంగా కూరను తయారు చేసుకోవచ్చు. కూరగాయలు లేకుండా కూర ఏంటని ఆలోచిస్తున్నారా.. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కేవలం ఉల్లిపాయలతో మనం ఎంతో రుచిగా ఉండే కూరను తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయలతో చేసే ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. కేవలం నిమిషాల వ్యవధిలోనే తయారు చేసుకోగలిగే ఈ ఉల్లిపాయ ఫ్రై తయారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – పావు కిలో, తరిగిన పచ్చిమిర్చి – 2, జీలకర్ర – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కరివేపాకు – కొద్దిగా, నూనె – 2 టేబుల్ స్పూన్స్.
ఉల్లిపాయ ఫ్రై తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి కలపాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను మధ్యస్థ మంటపై వేయించాలి. ఉల్లిపాయలల్లో ఉండే నీరంతా పోయి అవి దగ్గర పడే వరకు బాగా వేయించాలి. ఉల్లిపాయలు చక్కగా వేగి రంగు మారిన తరువాత పసుపు, కారం వేసి కలపాలి. వీటిని మరో రెండు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నంతో పాటు చపాతీతో కూడా కలిపి తినవచ్చు. ఏ వంట చేయాలో తోచనప్పుడు, వంట చేయడానికి సమయం తక్కువగా ఇలా ఉల్లిపాయలతో అప్పటికప్పుడు ఎంతో రుచిగా ఈ విధంగా కూరను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.