Pachi Mirchi Avakaya Nilva Pachadi : పచ్చిమిర్చి తెలియని వారు దీనిని ఉపయోగించని వారు ఉండరనే చెప్పవచ్చు. మనం చేసే ప్రతి వంటలోనూ దీనిని ఉపయోగిస్తాము. మనం చేసే వంటకానికి చక్కటి రుచిని తేవడంలో పచ్చిమిర్చి మనకు సహాయపడుతుంది. కొందరూ వీటిని నూనెలో వేయించి, మంటపై కాల్చుకుని కూడా తింటారు. ఈ పచ్చిమిర్చిని వంటల్లో, వివిధ రకాల పచ్చళ్ల తయారీలో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. ఇతర వంటకాల్లో వాడడంతో పాటు కేవలం పచ్చిమిర్చితో మనం పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడి నిల్వ కూడా ఉంటుంది. పచ్చిమిర్చి పచ్చడి పుల్లగా, కారంగా చాలా రుచిగా ఉంటుంది. మొదటిసారి చేసే వారు కూడా పచ్చడిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. పచ్చిమిర్చితో నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చిమిర్చి నిల్వ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చిమిర్చి – పావు కిలో, నిమ్మకాయలు – 4, ఆవాలు – అర టీ స్పూన్, ఉప్పు – 2 టీ స్పూన్స్, నూనె – 7 టీ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 6, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, మెంతులు పొడి – పావు టీ స్పూన్, ఆవ పిండి – 2 టీ స్పూన్స్ , జీలకర్ర పొడి – పావు టీ స్పూన్.
పచ్చిమిర్చి నిల్వ పచ్చడి తయారీ విధానం..
ముందుగా ఒక పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి. తరువాత వాటిని అర ఇంచు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలను కచ్చా పచ్చాగా దంచుకుని వేసుకోవాలి.తరువాత అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను, పసుపును, ఉప్పును వేసి కలిపి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత మెంతుల పొడి, ఆవపిండి, జీలకర్ర పొడి వేసి కలపాలి. తరువాత వీటిని పూర్తిగా మెత్తగా అయ్యే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తరువాత నిమ్మరసం పిండి చల్లగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత ఈ పచ్చడిని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పచ్చిమిర్చి నిల్వ పచ్చడి తయారవుతుంది. ఈ పచ్చడి తయారు చేసినప్పటి కంటే రెండు రోజుల తరువాత మరింత రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే పెరుగన్నంలోకి కూడా ఈ పచ్చడి రుచిగా ఉంటుంది. అందరూ ఈ పచ్చడిని ఇష్టంగా తింటారు.