Mysore Pak : మైసూర్‌పాక్‌ను ఇలా చేశారంటే.. అచ్చం స్వీట్ షాపుల్లో విధంగా వ‌స్తుంది.. మొత్తం తినేస్తారు..

Mysore Pak : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే ప‌దార్థాల్లో మైసూర్ పాక్ ఒక‌టి. దీనిని తిన‌ని వారు ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌నే ఉండ‌రు. నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మెత్త‌గా గుల్ల‌గుల్ల‌గా క‌మ్మ‌టి రుచిని క‌లిగి ఉంటుంది ఈ మైసూర్ పాక్. అచ్చం స్వీట్ షాపుల్లో ల‌భించే విధంగా ఉండే మైసూర్ పాక్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కింద చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల గుల్ల‌గుల్ల‌గా, మెత్త‌గా, రుచిగా ఉండే మైసూర్ పాక్ ను మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. స్వీట్ షాపులో దొరికే విధంగా ఉండే మైసూర్ పాక్ ను ఇంట్లో ఏవిధంగా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మైసూర్ పాక్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

శ‌న‌గ‌పిండి – ఒక క‌ప్పు, మైదా పిండి – ఒక టేబుల్ స్పూన్, నూనె – రెండున్న‌ర క‌ప్పులు, పంచ‌దార – మూడు క‌ప్పులు, నీళ్లు – ఒక‌టిన్న‌ర క‌ప్పు.

Mysore Pak recipe in telugu make in this method
Mysore Pak

మైసూర్ పాక్ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో శ‌న‌గ‌పిండిని జ‌ల్లించి తీసుకోవాలి. త‌రువాత అందులో మైదా పిండి, 2 టీస్పూన్ల నూనె వేసి క‌లుపుకోవాలి. త‌రువాత మైసూర్ పాక్ ను వేసుకోవ‌డానికి ఒక గిన్నెకు నూనె రాసి ఉంచాలి. త‌రువాత ఒక క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. అలాగే మరో స్ట‌వ్ మీద లోతుగా ఉండే క‌ళాయిలో పంచ‌దార‌,నీళ్లు పోసి క‌ల‌పాలి. పంచ‌దార క‌రిగి తీగ పాకం వ‌చ్చిన త‌రువాత ముందుగా త‌యారు చేసుకున్న శ‌న‌గ‌పిండిని వేసి క‌ల‌పాలి. శన‌గ‌పిండి అంతా క‌లిసేలా క‌లిపిన త‌రువాత అందులో వేడి చేసుకుంటున్న నూనెను గంటెతో పోసుకోవాలి. ఇలా పోసేట‌ప్పుడు నూనె అలాగే పంచ‌దార మిశ్ర‌మం పెద్ద మంట‌పై బాగా కాగుతూ ఉండేలా చూసుకోవాలి. ఇలా నిమిషానికి ఒక‌సారి నూనె పోస్తూ క‌లుపుతూ ఉండాలి. చివ‌ర‌గా అర క‌ప్పు నూనె మిగిలి ఉండ‌గా ఈ నూనెనంత ఒకేసారి శ‌న‌గ‌పిండిలో మిశ్ర‌మంలో పోసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

దీనిని వెంట‌నే నూనె రాసి ఉంచిన గిన్నెలో వేసుకోవాలి. ఇది కొద్దిగా ఆరిన త‌రువాత కావాల్సిన ఆకారంలో క‌త్తితో ముక్క‌లుగా చేసుకోవాలి. త‌రువాత దీనిని మూడు నుండి నాలుగు గంట‌ల పాటు పూర్తిగా చ‌ల్లారిన త‌రువాత ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల స్వీట్ షాపుల్లో ల‌భించే విధంగా రుచిగా గుల్ల‌గుల్లగా ఉండే మైసూర్ పాక్ త‌యారవుతుంది. దీనిని త‌యారు చేసేట‌ప్పుడు పాకం లేత‌గా అలాగే ముదురుగా అవ్వ‌కుండా చూసుకోవాలి. లేత పాకం వ‌స్తే మైసూర్ పాక్ పొడిలా అవుతుంది. ముదురు పాకం వస్తే మైసూర్ పాక్ గ‌ట్టిగా అవుతుంది. అలాగే దీనిలో ఫుడ్ క‌ల‌ర్ ను కూడా వేసుకోవ‌చ్చు. బ‌య‌ట కొనుగోలు చేసే ప‌ని లేకుండా ఇలా ఇంట్లోనే ఎంతో రుచిగా ఉండే మైసూర్ పాక్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts