Pallila Karam Podi : మనం వంటింట్లో అనేక రకాల కారం పొడులను తయారు చేస్తూ ఉంటాం. చాలా తక్కువ సమయంలో, చాలా సులభంగా మనం వీటిని తయారు చేసుకోవచ్చు. ఈ కారం పొడులను మనం అన్నంతోపాటు లేదా ఇడ్లీ, దోశ వంటి వాటితో కూడా తింటూ ఉంటాం. మనం వంటింట్లో తయారు చేసే కారం పొడుల్లో పల్లీల కారం పొడి కూడా ఒకటి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పల్లీలను ఉపయోగించి మనం ఎంతో రుచిగా ఉండే కారం పొడిని తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ సమయంలోనే ఎంతో రుచిగా ఉండే పల్లీల కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పల్లీల కారం పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – ఒక కప్పు, ఎండు మిరపకాయలు – 10 లేదా తగినన్ని, నూనె – ఒక టీ స్పూన్, కరివేపాకు – గుప్పెడు, ఉప్పు – తగినంత, వెల్లుల్లి రెబ్బలు – 6, ఎండు కొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు.
పల్లీల కారం పొడి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత ఎండు మిరపకాయలను వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తరువాత పల్లీలను, కరివేపాకును వేసి కరివేపాకు కరకలాడే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యే వరకు ఉంచాలి. ఇవి చల్లగా అయిన తరువాత పొడిగా ఉన్న జార్ లో వేయాలి. ఇందులోనే ఎండు కొబ్బరి ముక్కలను, వెల్లుల్లి రెబ్బలను, ఉప్పును వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పల్లీల కారం పొడి తయారవుతంది. దీనిని గాలి తగలకుండా మూత ఉండే గాజు సీసాలో నిల్వ చేసుకోవడం వల్ల 20 రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న పల్లీల కారం పొడిని దోశ, ఇడ్లీ, ఉప్మా వంటి వాటితో పాటు అన్నంతో కూడా కలిపి తినవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. పైగా ఆరోగ్యకరం కూడా.