Vegetable Pulao : మనలో చాలా మంది పులావ్ ను తినడానికి ఇష్టపడతారు. మనం వివిధ రకాల పులావ్ లను తయారు చేస్తూ ఉంటాం. అందులో వెజిటెబుల్ పులావ్ కూడా ఒకటి. వెజిటెబుల్ పులావ్ ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. మనం తరచూ చేసే పులావ్ కు బదులుగా కింద చెప్పిన విధంగా చేసే వెజిటెబుల్ పులావ్ కూడా ఎంతో రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభమే. భిన్నంగా ఎంతో రుచిగా ఉంటే వెజిటెబుల్ పులావ్ ను ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వెజిటెబుల్ పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – పావు కిలో, నీళ్లు – ఒకటిన్నర గ్లాస్, నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్, మరాఠీ మొగ్గ – 1, సాజీరా – ఒక టీ స్పూన్, జీడి పప్పు – కొద్దిగా, పొడుగ్గా తరిగిన పచ్చి మిర్చి – 4, ఎండు మిర్చి – 2, కరివేపాకు – రెండు రెబ్బలు, బిర్యానీ ఆకులు – 2, తరిగిన బంగాళాదుంప – 1(పెద్దది), తరిగిన క్యారెట్ – 2 ( చిన్నవి), సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1 (పెద్దది), సన్నగా పొడుగ్గా తరిగిన టమాటాలు – 2, ఉప్పు – తగినంత, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పచ్చి బఠాణీ – అర కప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా మిశ్రమం తయారీకి కావల్సిన పదార్థాలు..
గసగసాలు – ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క ముక్కలు – 2, లవంగాలు – 5, ధనియాలు – ఒక టీ స్పూన్, యాలకులు – 3, సోంపు గింజలు – ఒక టీ స్పూన్, జాజికాయ – పావు ముక్క, అనాస పువ్వు – 1, జాప్రతి – 1, పెద్దగా తరిగిన ఉల్లిపాయ – 1, నీళ్లు – తగినన్ని.
వెజిటెబుల్ పులావ్ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో నీళ్లు తప్ప మసాలా మిశ్రమానికి కావల్సిన పదార్థాలన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతుండగానే మరో స్టవ్ మీద అడుగు భాగంలో మందంగా ఉండే కళాయిని ఉంచి అందులో నూనె వేయాలి. నూనె కాగిన తరువాత మరాఠీ మొగ్గ, సాజీరా, జీడి పప్పు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత పచ్చి మిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, బిర్యానీ ఆకులు వేసి వేయించుకోవాలి. తరువాత బంగాళాదుంప ముక్కలను, క్యారెట్ ముక్కలను, ఉల్లిపాయ ముక్కలను, టమాట ముక్కలను వేసి కలిపి మూత పెట్టి చిన్న మంటపై 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత బియ్యం వేసి కలిపి చిన్న మంటపై 10 నుండి 15 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. తరువాత ఉప్పు, నెయ్యి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో 3 నిమిషాల పాటు వేయించుకోవాలి.
తరువాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా దినుసుల పేస్ట్ ను వేసి కలిపి 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత పచ్చి బఠాణీలను వేసి కలిపి 2 నిమిషాలు వేయించాలి. తరువాత మరుగుతున్న నీటిని పోసి కలపాలి. చివరగా కొత్తిమీరను వేసి కలిపి మూతపెట్టి 20 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తరువాత కూడా 5 నిమిషాల పాటు మూత తీయకుండా అలాగే ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెజిటెబుల్ పులావ్ తయారవుతుంది. ఈ పులావ్ తయారీలో నానబెట్టిన బియ్యాన్ని కాకుండా పొడి బియ్యాన్ని ఉపయోగించాలి. ఇలా తయారు చేసే పులావ్ చాలా రుచిగా ఉంటుంది. దీన్ని నేరుగా తినవచ్చు. లేదా ఏదా కూరతో అయినా తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది.