Panasa Thonalu : పనస తొనలు.. మన సులభంగా చేసుకోదగిన స్నాక్స్ ఐటమ్స్ లో ఇవి కూడా ఒకటి. చాలా మంది వీటిని రుచి చూసే ఉంటారు. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. తీపి పనస తొనలతో పాటు కారం పనస తొనలను కూడా తయారు చేస్తూ ఉంటారు. కారం పనస తొనలు కూడా చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ తినాలనిపించినప్పుడు, ఇంటికి అతిథులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఈ కారం పనస తొనలను తయారు చేసి పెట్టవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే కారం పనస తొనలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కారం పనస తొనల తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదాపిండి – ఒక కప్పు, ఉప్పు – తగినంత, వంటసోడా – 1/8 టీ స్పూన్, వాము – ఒక టీ స్పూన్, వేడి నూనె – 2 టేబుల్ స్పూన్స్, అల్లం – ఒక ఇంచు ముక్క, పచ్చిమిర్చి – 1, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
కారం పనస తొనల తయారీ విధానం..
ముందుగా గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, వంటసోడా, వాము , నూనె వేసి కలపాలి. తరువాత అల్లాన్ని, పచ్చిమిర్చిని పేస్ట్ లాగా చేసుకుని వేసుకోవాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. తరువాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ఉండను తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ వీలైనంత పలుచగా గుడ్డు ఆకారంలో పొడవుగా వత్తుకోవాలి. తరువాత కత్తితో వత్తుకున్న చపాతీని పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి.
తరువాత అంచులను ఒకే దగ్గరికి వత్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె కొద్దిగా వేడయ్యాక పనస తొనలను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై క్రిస్పీగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న వాటిపై కొద్దిగా కారాన్ని చల్లుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కారం పనస తొనలు తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల 15 రోజుల పాటు తాజాగా ఉంటాయి. ఈ విధంగా తయారు చేసిన పనస తొనలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.