Pappannam : మనం రకరకాల రైస్ వెరైటీలను తయారు చేస్తూ ఉంటాము. రైస్ వెరైటీలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. మనం సులభంగా చేసుకోదగిన రైస్ వెరైటీలలో పప్పన్నం కూడా ఒకటి. దీనినే తెలంగాణా కిచిడీ అని కూడా అంటారు. బియ్యం, కందిపప్పు కలిపి చేసే ఈ పప్పున్నం చాలా రుచిగా ఉంటుంది. ఏ కూరతో తిన్నా కూడా ఈ పప్పన్నం చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకు ఈ పప్పన్నంలో నెయ్యి వేసి ఇవ్వడం వల్ల వారి శరీరం బలంగా తయారవుతుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో కమ్మగా, రుచిగా ఉండే ఈ పప్పన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పప్పన్నం తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 4 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు -ఒక రెమ్మ, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి- 3, తరిగిన ఉల్లిపాయ – 1, పసుపు – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, అర గంటపాటు నానబెట్టిన కందిపప్పు – పావు కప్పు, గంటపాటు నానబెట్టిన బియ్యం – ఒక పెద్ద కప్పు, ఉప్పు – తగినంత.
పప్పన్నం తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత బియ్యం, కందిపప్పు, ఉప్పు వేసి కలపాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత తగినన్ని నీళ్లు పోసి కలపాలి. తరువాత కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆవిరి పోయిన తరువాత మూత తీసి అంతా కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పప్పన్నం తయారవుతుంది. దీనిని పచ్చడి, పెరుగుతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన పప్పన్నాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.