Beerakaya Telagapindi Kura : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో బీరకాయ కూడా ఒకటి. బీరకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో మేలు చేసే పోషకాలు ఉంటాయి. బీరకాయలను ఆహారంగా తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. రక్తహీనత తగ్గుతుంది. బరువు తగ్గడంలో కూడా బీరకాయలు మనకు ఎంతగానో సహాయపడతాయి. మలబద్దకాన్ని తగ్గించడంలో, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, చర్మాన్ని సంరక్షించడంలో ఇలా అనేక రకాలుగా బీరకాయలు మనకు ఉపయోగపడతాయి. సాధారణ బీరకాయ కూరతో పాటు ఇందులో తెలగపిండి వేసుకుని కూడా చాలా మంది వండుకుంటూ ఉంటారు.
తెలగపిండి వేసి చేసే బీరకాయ కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరను తయారు చేయడం కూడా చాలా సులభం. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ బీరకాయ తెలగపిండి కూరను ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బీరకాయ తెలగపిండి కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్నగా తరిగిన బీరకాయ ముక్కలు – పావుకిలో, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 3, తరిగిన పచ్చిమిర్చి – 5, కరివేపాకు – ఒక రెమ్మ, వెల్లుల్లి రెబ్బలు – 10 నుండి 15, తెలగపిండి – పావు కప్పు, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్.
బీరకాయ తెలగపిండి కూర తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలను, తాళింపు దినుసులను వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత ధనియాల పొడి, పసుపు, కారం, ఉప్పు వేసి కలపాలి. తరువాత బీరకాయ ముక్కలు వేసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు వేయించాలి. బీరకాయ ముక్కలు మగ్గిన తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత మూత పెట్టి మరో 8 నిమిషాల పాటు ఉడికించాలి.
బీరకాయ ముక్కలు ఉడికి నూనె పైకి తేలిన తరువాత తెలగపిండి వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి మరో 5 నిమిషాల ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బీరకాయ తెలగపిండి కూర తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తెలగపిండి వేసి బీరకాయ కూరను చాలా సులభంగా, రుచిగా తయారు చేసుకోవచ్చు. దీనిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.