Pooja Room : మనం నిత్యం ఇంట్లో దేవున్ని పూజిస్తూ ఉంటాం. కష్టాలు, ఆర్థిక బాధలు, అనారోగ్యాలు దరి చేరకుండా ఉండాలని మనం దేవున్ని పూజిస్తాం. అయితే చాలా మందికి దేవుని పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి.. ఎలా శుభ్రం చేయాలో తెలియదు. పూజ గదిని శుభ్రం చేసే విధివిధానాలు తెలియక దేవుని ఆగ్రహానికి లోనై ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. అసలు దేవుని గది ఏ వారం శుభ్రం చేయాలి.. ఎలా శుభ్రం చేయాలి.. ఎలాంటి పద్దతులను పాటిస్తే దేవుడి అనుగ్రహం మన మీద ఉంటుంది అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం శుభ్రంగా, చక్కగా, సానుకూలంగా ఉన్న ఇంటిని మాత్రమే దేవుడు సందర్శిస్తాడని చెప్పబడుతుంది.
కాబట్టి ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ పూజగదిని అలకరించుకోవడం వల్ల భగవంతుడు ఇంటికి తప్పక వస్తాడు. ఇంటిని శుభ్రపరుచుకోవడంలో భాగంగా పూజ గదిని శుభ్రపరచడం కూడా చాలా అవసరం. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పూజ గది లోపల ఒక చిన్న ఆలయం నిర్మించుకున్నట్టయితే దాన్ని సబ్బు నీటి ద్రావణంతో కానీ, క్లీనింగ్ ఏజెంట్ లతో కానీ శుభ్రపరచాలి. ఇంట్లో లోహం లేదా వెండితో చేసిన విగ్రహాలు ఉన్నట్టయితే ఉప్పు లేదా టూత్ పేస్ట్ వంటి సాధారణ పదార్థాలతో శుభ్రం చేయాలి. వెండి పాత్రలను శుభ్రం చేయడంలో వెండి అత్యుత్తమ ఫలితాలను అందిస్తుంది.
ఇది విగ్రహాలను శుభ్రపరచడమే కాకుండా ప్రకాశించేలా చేస్తుంది. రాగితో చేసిన పూజా సామానును మనం విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. ఈ రాగి సామానును చింతపండు గుజ్జుతో శుభ్రం చేయాలి. మంట, నూనె కారణంగా మట్టితో చేసిన ప్రమిదలపై జిడ్డు పేరుకుపోతుంది. వీటిని వేడి సబ్బు నీటిలో 20 నుండి 25 నిమిషాల పాటు నానబెట్టాలి. తరువాత వీటిని మరకలు తొలగిపోయేల స్క్రబ్ చేయాలి. దీపపు కుందులు, దీపపు స్థంభాలు ఎక్కువగా ఇత్తడివై ఉంటాయి. వీటిని చింతపండు, ఉప్పు, పేస్ట్ తో శుభ్రం చేయవచ్చు. వీటిని శుభ్రం చేసిన తరువాత దేవుడికి అలంకరించే దండలు, వస్త్రాలు, తల పాగలు శుభ్రం చేయాలి. వీటిని సబ్బు నీటిలో నానబెట్టి శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోవాలి. పూజ గదిలో ఉన్న టైల్స్ ను, గోడలను సబ్బు నీటితో శుభ్రం చేసుకోవాలి.
అలాగే దేవుడి పటాలను వారంలో ఏదో ఒక రోజు శుభ్రం చేసుకోవచ్చు. వారంలో వీలైన రోజున చక్కగా కూర్చొని మనస్పూర్తిగా దైవ నామస్మరణ చేస్తూ పటాలను, విగ్రహాలను శుభ్రం చేసుకోవాలి. మనస్సును లగ్నం చేసి పూజగదిని శుభ్రం చేసుకోవాలి. అపరిశుభ్రంగా ఉన్న చోట దైవారాధణ చేయకూడదు. ఎలా అయితే ప్రతిరోజూ స్నానం చేస్తామో, అలాగే వారానికి ఒకసారి దేవుడి గదిని, దేవుడి విగ్రహాలను, పూజకు ఉపయోగించే ప్రతి వస్తువును శుభ్రం చేసుకోవాలి. దేవుడి గదిలో నేలను శుభ్రపరచడానికి చీపురును ఉపయోగించకూడదు.
తడి బట్టతో నేలను శుభ్రపరచాలి. ఇలా శుభ్రం చేసిన తరువాత మనకు వీలైనంత సేపు కూర్చొని ధ్యానాన్ని చేయాలి. మనసును, శరీరాన్ని లగ్నం చేసి మాత్రమే పూజ చేయాలి. లేదంటే మనం ఎంత శుభ్రం చేసినా కూడా మానసికంగా మనం భగవంతునికి దగ్గర కాకుండా మనసు ఆయన మీద లగ్నం చేయకుండా మనం ప్రార్థనా లేదా ద్యానం చేసినా భగవంతుడు మెచ్చడు. భగవంతుడు మెచ్చని పూజ ఎంత చేసినా కూడా ఫలితం ఉండదు.