Ragi Halva : రాగి హ‌ల్వా.. పిల్ల‌లు, పెద్ద‌లు అంద‌రూ తినాల్సిన‌ది.. రుచిక‌రం, ఆరోగ్య‌క‌రం..!

Ragi Halva : మ‌న‌కు బ‌య‌ట స్వీట్ షాపుల్లో ల‌భించే వాటిల్లో హ‌ల్వా ఒక‌టి. హ‌ల్వా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ హ‌ల్వా త‌యారీలో మైదాపిండి, కార్న్ ఫ్లోర్, పంచ‌దార‌ను ఉప‌యోగిస్తాం. క‌నుక దీనిని తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి హాని క‌లుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. అలాగే దీనిని ఎక్కువ‌గా తీసుకోలేము. మ‌న ఆరోగ్యానికి మేలు చేసేలా రాగుల‌తో కూడా మ‌నం హ‌ల్వాను త‌యారు చేసుకోవ‌చ్చు. రాగుల‌తో చేసే హ‌ల్వా రుచిగా ఉండ‌డంతో పాటు దీనిని తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది. బెల్లం వేసి త‌యారు చేస్తాం క‌నుక షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు కూడా దీనిని తిన‌వ‌చ్చు. రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా రాగుల‌తో హ‌ల్వాను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

రాగి హ‌ల్వా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

రాగులు – ఒక క‌ప్పు, నీళ్లు – 7 క‌ప్పులు, బెల్లం – ఒక‌టిన్న‌ర క‌ప్పు, ప‌చ్చికొబ్బ‌రి – రెండు క‌ప్పులు, నెయ్యి – 5 టేబుల్ స్పూన్స్, యాల‌కుల పొడి – ఒక టీ స్పూన్.

Ragi Halva best healthy food for all
Ragi Halva

రాగి హ‌ల్వా త‌యారీ విధానం..

ముందుగా రాగుల‌ను ఒక గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి ఒక రాత్రంతా నాన‌బెట్టాలి. రాగులు నానిన త‌రువాత వాటిని ఒక జార్ లోకి తీసుకుని అందులో ఒక క‌ప్పు నీటిని పోయాలి. వీటిని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఫిల్ట‌ర్ ను ఉంచి అందులో కాట‌న్ వ‌స్త్రాన్ని ఉంచాలి. అందులో మిక్సీ ప‌ట్టుకున్న రాగి మిశ్ర‌మాన్ని వేసి రాగి పాల‌ను తీసుకోవాలి. మిగిలిన రాగి పిప్పిని మ‌ర‌లా జార్ లో వేసి మ‌రో క‌ప్పు నీళ్లు పోసి మిక్సీ ప‌ట్టుకోవాలి. దీనిని కూడా కాట‌న్ వ‌స్త్రంలో వేసి రాగి పాల‌ను తీసుకోవాలి. మ‌రో గిన్నెలో ఒక క‌ప్పు నీళ్లు పోసి అందులో రాగి పిప్పి ఉన్న కాట‌న్ మూట‌ను ఉంచి దానిని క‌దుపుతూ పాల‌ను తీసుకోవాలి.

త‌రువాత ఆ పిప్పిలో నీటిని పోస్తూ చేత్తో బాగా పిండుతూ పాల‌ను తీసుకోవాలి. రాగుల నుండి రాగి పాల‌ను తీయ‌డానికి 5 క‌ప్పుల నీటిని ఉప‌యోగించాల్సి ఉంటుంది. అలాగే జార్ లో కొబ్బ‌రిని కూడా వేసి మిక్సీ ప‌ట్టుకోవాలి. ఈ మిక్సీ ప‌ట్టుకున్న కొబ్బ‌రి నుండి 2 క‌ప్పుల నీటిని ఉప‌యోగించి కొబ్బ‌రి పాల‌ను తీసుకోవాలి. త‌రువాత రాగి పాల‌ల్లో బెల్లాన్ని వేసి బెల్లం క‌రిగే వ‌ర‌కు తిప్పుతూ ఉండాలి. బెల్లం క‌రిగిన త‌రువాత ఈ పాల‌ను మ‌రోసారి వ‌డ‌క‌ట్టాలి. ఇప్పుడు అడుగు భాగం మందంగా ఉండే క‌ళాయిని తీసుకుని వేడి చేయాలి. అందులో రాగి పాల‌ను, కొబ్బ‌రి పాల‌ను పోసి ఉడికించాలి. ఈ మిశ్ర‌మాన్ని అడుగు భాగం మాడిపోకుండా క‌లుపుతూ ఉడికించాలి. అర‌గంట పాటు ఉడికించిన త‌రువాత 5 నిమిషాల‌కొక‌సారి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేస్తూ మ‌రో అర గంట పాటు ఉడికించాలి.

ఇలా గంట పాటు ఉడికించిన త‌రువాత ఈ మివ్ర‌మం ద‌గ్గ‌ర ప‌డి చిక్క‌గా అవుతుంది. ఇప్పుడు యాల‌కుల పొడి వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు అంచు ఉన్న ప్లేట్ ను తీసుకుని దానిఇక నెయ్యిని రాయాలి. త‌రువాత అందులో ఉడికించిన రాగి పాల మిశ్ర‌మాన్ని వేయాలి. ఇది పూర్తిగా చ‌ల్లారే వ‌ర‌కు ప‌క్క‌కు ఉంచుకోవాలి. పూర్తిగా చ‌ల్లారి హ‌ల్వాలా త‌యార‌యిన త‌రువాత చాకుతో మ‌న‌కు కావ‌ల్సిన ఆకారంలో ముక్క‌లుగా చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల రాగి హ‌ల్వా త‌యార‌వుతుంది. ఈ హ‌ల్వా త‌యారీలో మ‌నం అన్ని ఆరోగ్యానికి మేలు చేసే ప‌దార్థాల‌నే ఉప‌యోగించాం. క‌నుక ఈ హ‌ల్వాను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. రాగిజావ‌, రాగి ఉప్మా, వంటి ఆహార ప‌దార్థాలు తిన‌ని పిల్ల‌ల‌కు ఇలా రాగుల‌తో హ‌ల్వా ను చేసి పెట్ట‌డం వ‌ల్ల వారు చ‌క్క‌గా తింటారు.

Share
D

Recent Posts