food

ఆరోగ్యకరమైన పుదీనా చట్నీ ఏ విధంగా తయారు చేయాలో తెలుసా?

సాధారణంగా పుదీనాలో ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మనం చేసే వివిధ రకాల వంటలలో పుదీనా ఆకులను వేసి చేస్తుంటాము. ఇవి వంటలకు రుచిని,మంచి సువాసనను అందించడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. మరి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన పుదీనా చట్నీ ఏ విధంగా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

పుదీనా ఆకులు రెండు కప్పులు, ఎండుమిర్చి 6, జీలకర్ర టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కరివేపాకు రెండు రెమ్మలు, పసుపు చిటికెడు, కొబ్బరి ముక్కలు అర కప్పు, వేరుశెనగపప్పు అర కప్పు, నూనె తగినంత, పోపు దినుసులు టేబుల్ స్పూన్, చింతపండు నిమ్మ పండు సైజ్.

pudina chutney recipe how to make this

తయారీ విధానం

ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె వేడి అయిన తర్వాత జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చిని దోరగా వేయించుకోవాలి. అదేవిధంగా వేరుశెనగపప్పుని కూడా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మరొక టేబుల్ స్పూన్ నూనె వేసి ఒక నిమిషం పాటు పుదీనా ఆకులను వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి కొబ్బరి ముక్కలు, వేరుశెనగపప్పు, తగినంత ఉప్పు, ముందుగా వేయించి పెట్టుకొన్న ఎండు మిర్చి, జీలకర్ర, కరివేపాకు, చింతపండు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. చివరిగా ముందుగా వేయించుకున్న పుదీనా ఆకులను వేసి మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేయాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పుదీనా చట్నీకి కాస్త పోపు పెట్టుకుంటే ఎంతో రుచి కరమైన పుదీనా చట్నీ తయారైనట్లే.

Admin

Recent Posts