మన దేశంలో శ్రీమహావిష్ణువుకు ఉన్న ముఖ్యమైన ఆలయాల్లో తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం కూడా ఒకటి. పాలసముద్రంలో శేషతల్పంపై విష్ణువు శయనిస్తూ ఉన్న రూపాన్ని మనం ఈ ఆలయంలో దర్శించుకోవచ్చు. ఇక ఈ ఆలయంలో బయటపడ్డ సంపద ప్రపంచ దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే సంపదతో ప్రపంచంలోనే అనంత పద్మనాభ స్వామి అత్యంత ధనం కలిగి ఉన్న దైవంగా మనకు దర్శనమిస్తున్నాడు. కాగా ఈ క్షేత్రంలో అనంత పద్మనాభ స్వామి స్వయంగా వెలిశాడని స్థల పురాణం చెబుతోంది.
అనంత పద్మనాభ స్వామి ఆ క్షేత్రంలో ఎలా వెలిశాడనేది మనకు కొన్ని పురాణాల ద్వారా తెలుస్తుంది. పూర్వం దివాకరుడు అనే రుషి ఉండేవాడు. అతను విష్ణు భక్తుడు. అతనికి విష్ణువు ఒక రోజు చిన్న బాలుడి రూపంలో కనిపిస్తాడు. ఆ బాలుడు ముద్దులొలుకుతూ ఉండడంతో దివాకరుడు అతన్ని తన ఇంట్లో ఉండాలని కోరుతాడు. అయితే ఆ బాలుడు సాక్షాత్తూ శ్రీమహావిష్ణువేనని దివాకరుడికి తెలియదు. ఈ క్రమంలో ఆ బాలుడు.. తాను చేసే పనులకు అడ్డు చెప్పకూడదని, ఒకవేళ చెబితే వెంటనే ఇంటి నుంచి వెళ్లిపోతానని షరతు విధిస్తాడు. అందుకు దివాకరుడు సరేనంటాడు.
అలా ఆ బాలుడు దివాకరుడి ఇంటికి చేరుకున్నాక నిత్యం అతన్ని హేళన చేసేవాడు. అల్లరి కూడా చేసేవాడు. అయినా దివాకరుడు ఆ బాలున్ని ఒక్క మాట కూడా అనేవాడు కాదు. అయితే ఒక రోజు దివాకరుడు తపస్సు చేసుకుంటుండగా ఆ బాలుడు వచ్చి సాలగ్రామాలను అతని నోట్లో వేస్తాడు. దీంతో దివాకరుడికి పట్టరానంత ఆగ్రహం వస్తుంది. అంతే.. మరుక్షణమే ఆ బాలుడు అదృశ్యమైపోతాడు. అప్పుడే దివాకరుడికి ఆ బాలుడు శ్రీమహావిష్ణువు అన్న సంగతి తెలుస్తుంది. అయితే ఆ బాలుడు అదృశ్యమవుతూ తనను చూడాలంటే అనంతన్‌కాడు దగ్గరకు రమ్మని చెబుతాడు. దీంతో దివాకరుడు స్వామిని వెదుక్కుంటూ వెళతాడు.
సముద్ర తీరపాత్రంలో ఓ భారీ వృక్షం శ్రీమహావిష్ణువు రూపంలో అప్పుడే దివాకరుడికి కనిపిస్తుంది. అయితే అంతటి పెద్ద రూపాన్ని సరిగ్గా చూడలేకపోతున్నానని దివాకరుడు చెప్పడంతో స్వామి దివాకరున్ని భారీ కాయుడిగా మారుస్తాడు. దీంతో దివాకరుడు స్వామి దర్శనం చేసుకుంటాడు. అప్పటి నుంచి అక్కడ శ్రీమహావిష్ణువు అనంత పద్మనాభ స్వామిగా భక్తుల పూజలందుకుంటూ వస్తున్నాడు. ఇక ఆ ఆలయంలో టెంకాయలో మామిడికాయను ఉంచి ప్రసాదం ఇస్తారు. ఆలయం ప్రారంభం అయినప్పటి నుంచీ ఇలా ప్రసాదాన్ని ఇవ్వడం అక్కడ ఆనవాయితీగా వస్తోంది.
అనంత పద్మనాభ స్వామిని బలరాముడు దర్శించుకున్నాడని భాగవతంలో ఉంది. ఇక ఈ ఆలయానికి తిరువనంతపురం ట్రావెన్‌కోర్ రాజులు సంరక్షకులుగా ఉండేవారు. వారి కాలంలోనే అనంత పద్మనాభ స్వామికి అంతులేని సంపద వచ్చి చేరిందని చెబుతారు. ఇక ఆలయంలోని నేలమాళిగలలో ఉన్న గదుల్లో అన్ని గదులను ఇప్పటికే తెరిచి సంపదను లెక్కించారు. కానీ ఒక్క గదిని మాత్రం తెరవలేదు. ఎందుకంటే ఆ గదికి నాగబంధం ఉన్నదట. దాంతో ఆ గదిని తెరిస్తే అరిష్టాలు జరుగుతాయని విశ్వసిస్తున్నారు. అందుకనే అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఆ ఒక్క గదిని తెరవడం లేదు.
కాగా ఈ ఆలయంలో ఉన్న తెరవని ఆ ఒక్క గదిలోనే వెలకట్టలేని సంపదతోపాటు ఎన్నో రహస్యాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అవన్నీ మనుషుల కంట పడితే ప్రమాదమని, మానవజాతి వినాశనం జరుగుతుందని ప్రచారంలో ఉంది. ఈ క్రమంలోనే ఆ గది తలుపులను ఇప్పటి వరకు ఎవరూ తెరవలేదు. అయితే భవిష్యత్తులో దీనిపై ఏదైనా నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి. కేరళ రాజధాని తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది. దేశంలోని దాదాపు అన్ని ప్రముఖ నగరాల నుంచి అక్కడికి వెళ్లవచ్చు. రైల్వే, బస్సు, విమాన సదుపాయాలు ఉన్నాయి. తిరువనంత పురం రైల్వే స్టేషన్ లేదా ఎయిర్‌పోర్టులలో దిగితే ప్రైవేటు వాహనాల్లోనూ ఆలయానికి వెళ్లవచ్చు..!