Punjabi Style Dal Tadka : పంజాబీ స్టైల్‌లో దాల్ త‌డ్కా.. ఇలా చేయాలి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Punjabi Style Dal Tadka : పంజాబీ దాల్ త‌డ్కా..ఇది మ‌న‌కు ఎక్కువ‌గా రెస్టారెంట్ ల‌లో, పంజాబీ ధాబాల్లో ల‌భిస్తుంది. రోటీ, నాన్, బ‌ట‌ర్ నాన్ వంటి వాటితో తింటే ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇది పప్పు లాగా చిక్క‌గా, చారు లాగా ప‌లుచ‌గా ఉండ‌దు. ఈ దాల్ త‌డ్కాను ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. చాలా సుల‌భంగా ఎవ‌రైనా దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ దాల్ త‌డ్కాను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పంజాబీ దాల్ త‌డ్కా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

అర‌గంట పాటు నాన‌బెట్టిన కందిప‌ప్పు – అర క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, నీళ్లు – 300 ఎమ్ ఎల్, నూనె – ఒక టీ స్పూన్నెయ్యి – పావు క‌ప్పు, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 4, త‌రిగిన వెల్లుల్లి రెబ్బ‌లు – 5, త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2 టేబుల్ స్పూన్స్, చిన్న‌గా త‌రిగిన చిన్న ట‌మాట – 1, కారం – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2.

Punjabi Style Dal Tadka recipe in telugu make in this way
Punjabi Style Dal Tadka

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నెయ్యి – 2 టీ స్పూన్స్, ఎండుమిర్చి – 2, జీల‌క‌ర్ర – అర టీస్పూన్, త‌రిగిన వెల్లుల్లి రెబ్బ‌లు – 2, కారం – అర టీ స్పూన్.

పంజాబీ దాల్ త‌డ్కా త‌యారీ విధానం..

ముందుగా ప‌ప్పును కుక్క‌ర్ లో వేసుకోవాలి. త‌రువాత కొద్దిగా ఉప్పు, నూనె, ప‌సుపు వేసుకోవాలి. త‌రువాత నీళ్లు పోసి మూత పెట్టి ప‌ప్పును 5 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు మ‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత మూత తీసి ప‌ప్పును మెత్త‌గా చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. త‌రువాత జీల‌క‌ర్ర‌, ఎండుమిర్చి, వెల్లుల్లి త‌రుగు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత కారం, ఉప్పు, ప‌సుపు, జీల‌క‌ర్ర పొడి, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత ఉడికించిన ప‌ప్పు వేసి క‌ల‌పాలి. అవ‌స‌ర‌మైతే మ‌రో 50 ఎమ్ ఎల్ నీళ్లు పోసి క‌ల‌పాలి.

దీనిని మ‌రో 5 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని మ‌ర‌లా తాళింపు చేసుకోవాలి. దీని కోసం క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. త‌రువాత ఎండుమిర్చి, జీల‌క‌ర్ర‌, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి. త‌రువాత కారం వేసి వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ తాళింపును దాల్ త‌డ్కాపై వేసి అలాగే ఉంచాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే దాల్ తడ్కా త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడిగా తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన దాల్ త‌డ్కాను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts