Radish Chapati : మనకు అందుబాటులో ఉన్న కూరగాయల్లో ముల్లంగి కూడా ఒకటి. ఇది రుచిలో ఘాటుగా ఉంటుంది. కనుక దీన్ని తినేందుకు ఎవరూ ఇష్టపడరు. కానీ వాస్తవానికి ముల్లంగిని తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఇది షుగర్ ఉన్న వారికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల అధిక బరువు తగ్గడంతోపాటు షుగర్ లెవల్స్‌ను నియంత్రించవచ్చు. అయితే ముల్లంగిని నేరుగా తినడం కష్టం అనుకుంటే దాంతో ఎంతో రుచికరమైన చపాతీలను తయారు చేసి తినవచ్చు. ఇవి రుచిగా ఉండడమే కాదు.. ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ముల్లంగితో చపాతీలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముల్లంగి చపాతీల తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమ పిండి – రెండు కప్పులు, ముల్లంగి తురుము – ఒక కప్పు, జీలకర్ర – అర టీస్పూన్, కారం – ఒక టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీస్పూన్, ఉప్పు, నీళ్లు, నూనె, నెయ్యి – తగినంత.
ముల్లంగి చపాతీలను తయారు చేసే విధానం..
ఒక గిన్నెలో గోధుమ పిండి, ముల్లంగి తురుము, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద, జీలకర్ర వేసి పిండిని కలపాలి. సహజంగానే ముల్లంగిలో నీరు ఉంటుంది కాబట్టి కాసిన్ని నీళ్లు పోస్తే సరిపోతుంది. చివరగా కొద్దిగా నూనె పోసి బాగా కలిపి పావు గంట పాటు పక్కన పెట్టాలి. ఆ తరువాత చపాతీల్లా చేసుకుని పెనంపై వేసి రెండు వైపులా నెయ్యి వేస్తూ కాల్చుకోవాలి. వీటిని నేరుగా తినవచ్చు. లేదా ఏ కూరతో అయినా సరే తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.
ముల్లంగిలో అనేక ఔషధగుణాలు ఉంటాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. ముల్లంగిలో ఉండే జింక్, సెలీనియం వంటివి షుగర్ లెవల్స్‌ను తగ్గించేందుకు దోహదపడతాయి. ముల్లంగిని నేరుగా తినలేకపోతే ఇలా చపాతీలను చేసి తినవచ్చు. రోజూ ఒక చపాతీని తిన్నా ఎంతో మేలు జరుగుతుంది.