Ram Charan : సెలబ్రిటీలు ఈ మధ్య కాలంలో పలు బిజినెస్‌లను ప్రారంభించి వాటిల్లోనూ రాణిస్తున్న విషయం విదితమే. అయితే కొందరు మాత్రం ఆ వ్యాపారాల్లో లాభాలు గడిస్తుండగా.. కొందరు మాత్రం నష్టపోతున్నారు. ఇక రామ్ చరణ్ తేజ్ కూడా ఆయన ప్రారంభించిన ఓ బిజినెస్ దివాళా తీసిందని, కనీసం ఉద్యోగులకు వేతనాలను అందించే స్థితిలో కూడా ఆయన సంస్థ లేదని.. అందుకనే ఆ వ్యాపారానికి చెందిన కార్యకలాపాలను నిలిపివేశారని తెలుస్తోంది.
రామ్ చరణ్ తేజ 2015లో తన స్నేహితుడైన ఉమేష్‌తో కలిసి టర్బో మేఘా ఎయిర్‌వేస్ సంస్థను ప్రారంభించారు. తక్కువ ఖర్చుకే ప్రజలకు విమానయాన సేవలను అందించాలనే ఉద్దేశంతో ఈ సంస్థ పేరిట ట్రూజెట్ విమాన సర్వీసులను ప్రారంభించారు. అయితే ఈ సంస్థకు ఇటీవలి కాలంలో భారీగా నష్టాలు వచ్చాయని, కనుక ఈ బిజినెస్ దివాళా తీసిందని, ఉద్యోగులకు గత నవంబర్ నెల నుంచి వేతనాలను కూడా అందివ్వడం లేదని.. వార్తలు వస్తున్నాయి. అందువల్లే సంస్థ సేవలను కూడా ఆపేశారని అంటున్నారు. అయితే దీనిపై ట్రూ జెట్ సంస్థ స్పందించింది.
తమ సంస్థలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులను తొలగించామని, వారి స్థానంలో కొత్త వారిని నియమించామని ట్రూజెట్ తెలియజేసింది. అలాగే త్వరలోనే కొత్త సీఈవోను నియమిస్తామని, ప్రస్తుతం ట్రూజెట్ విమాన సేవలను నిలిపివేశామని, ఇది తాత్కాలికమేనని, త్వరలోనే సేవలను పునః ప్రారంభిస్తామని తెలియజేసింది. ఇక ఉద్యోగులకు వేతనాలను ఇవ్వడం లేదని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. తాము సకాలంలోనే ఉద్యోగులకు జీతాలను ఇస్తున్నామని తెలిపింది. ఈ మేరకు ట్రూజెట్ ట్వీట్ చేసింది.