Ram Gopal Varma : పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానాలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం.. భీమ్లా నాయక్. ఈ సినిమాకు నిర్వహించాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం కారణంగా సినిమా ఫంక్షన్‌ను రద్దు చేశారు. అయినప్పటికీ ట్రైలర్‌ను మాత్రం లాంచ్ చేశారు. ఈ క్రమంలోనే భీమ్లా నాయక్ ట్రైలర్ విడుదల కావడంతో పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఎట్టకేలకు విడుదల కాబోతుందని ఆనందంగా ఉన్నారు. అయితే ఈ సంతోష సమయంలో పవన్ ఫ్యాన్స్ మళ్లీ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. అది కూడా వర్మ చేసిన కామెంట్లపైనే కావడం విశేషం.
భీమ్లా నాయక్ ట్రైలర్‌ను చూసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భీమ్లా నాయక్‌లో పూర్తిగా రానానే కనిపించాడని అన్నారు. పవన్ ఒక ట్రైలర్ అయితే రానా సినిమా అని అన్నారు. ఇక పవన్ కోసం కథను అనేక మార్పులు చేసినా.. అసలు విషయం అంతా రానా పాత్రలోనే ఉందని అన్నారు.
ఇక బాహుబలి సినిమా వల్ల రానా అంటే ఎవరో హిందీ ప్రేక్షకులకు బాగా తెలుసని.. అయితే ఈ సినిమాను చూసిన హిందీ ప్రేక్షకులు రానాను హీరోగా, పవన్‌ను విలన్‌గా అనుకుంటారని.. పవన్ అంటే ఇష్టం ఉన్న నిర్మాతలు ఇలా ఎలా చేశారని అన్నారు. ఇక ఈ సినిమాలో రానా పాత్రకు ఇంకో హీరోని ఎంపిక చేసి ఉంటే బాగుండేదని అన్నారు.
ఇక BheeMLA Nayak లో వర్మ MLA అనే అక్షరాలను తొలగించారు. పవన్ వట్టి Bhee నే అని అన్నారు. దీంతో వర్మ చేసిన కామెంట్స్ ఫ్యాన్స్‌కు ఆగ్రహావేశాలను తెప్పిస్తున్నాయి. ఎప్పుడూ వర్మ ఇలాంటి వివాదాస్పద కామెంట్సే చేస్తుంటారు. కానీ ఈసారి పవన్‌పై చేసిన కామెంట్స్ మాత్రం సంచలనం కలిగిస్తున్నాయి.