Rasgulla : మనం పాలను రోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. పాలను తాగడం వల్ల మన శరీరానికి కలిగే మేలు గురించి ఎంత చెప్పినా తక్కువే. పాలతో చేసే తీపి పదార్థాలలో రసగుల్లా కూడా ఒకటి. రసగుల్లా రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలిసిన పని లేదు. ఇది మనకు బయట ఎక్కువగా దొరుకుతుంది. దీనిని మనం ఇంట్లో కూడా అంతే రుచిగా తయారు చేసుకోవచ్చు. రసగుల్లాను తయారు చేయడం చాలా సులభం. బయట దొరికే విధంగా ఎంతో రుచిగా ఉండే రసగుల్లాను ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రసగుల్లా తయారీకి కావల్సిన పదార్థాలు..
చిక్కని పాలు – ఒక లీటర్, నిమ్మ రసం – ఒక టీ స్పూన్, పంచదార – ఒక కప్పు, నీళ్లు – మూడు కప్పులు, యాలకుల పొడి – పావు టీ స్పూన్.
రసగుల్లా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పాలను తీసుకుని బాగా మరిగించుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడే నిమ్మరసాన్ని వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల పాలు విరుగుతాయి. ఇప్పుడు పాల విరుగుడులో ఉన్న నీరు అంతా పోయేలా వడకట్టాలి. ఇప్పుడు ఈ పాల విరుగుడును శుభ్రమైన వస్త్రంలో ఉంచి మూట కట్టి మూటపై బరువును ఉంచాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పంచదారను తీసుకుని అందులో నీళ్లను పోసి బాగా వేడి చేయాలి. ఇప్పుడు మూట కట్టిన పాల విరుగుడును ఒక గిన్నెలోకి తీసుకుని 10 నిమిషాల పాటు చేత్తో బాగా కలిపి కావల్సిన పరిమాణంలో ముద్దలుగా చేసి పంచదార నీళ్లలో వేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు యాలకుల పొడిని వేసి మంటను చిన్నగా చేసి మరో 10 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసిన రసగుల్లాను చల్లగా అయ్యే వరకు ఉంచి ఆ తరువాత 3 గంటల పాటు ఫ్రిజ్ లో పెట్టి ఆ తరువాత చిన్న గిన్నెలోకి తీసుకుని తినాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రసగుల్లా తయారవుతుంది. తీపి తినాలనిపించినప్పుడు ఇలా పాలతో చాలా సులవుగా రసగుల్లాను తయారు చేసుకుని తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.