Ratnapuri Halwa : మన ఆరోగ్యానికి మేలు చేసే దుంపలల్లో చిలగడదుంపలు కూడా ఒకటి. చిలగడదుంపలు కూడా ఇతర దుంపల వలె మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో పోషకాలు, ఆరోగ్యప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని మనం ఎక్కువగా ఉడికించి తీసుకుంటూ ఉంటాము. చాలా మంది ఉడికించిన చిలగడదుంపలను ఇష్టంగా తింటారు. ఈ చిలగడదుంపలను ఉడికించి తీసుకోవడంతో పాటు వీటితో మనం ఎంతో రుచిగా ఉండే హల్వాను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ హల్వాను తయారు చేయడం చాలా సులభం. తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈ హల్వాను తయారు చేసుకుని తినవచ్చు. రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ రత్నాపురీ హల్వాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రత్నాపురీ హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
ఆవిరి మీద ఉడికించిన చిలగడదుంపలు – 5, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, డ్రై ఫ్రూట్స్ – తగినన్ని, బొంబాయి రవ్వ – 2 టేబుల్ స్పూన్స్, బెల్లం తురుము – అర కప్పు, యాలకుల పొడి – కొద్దిగా.
రత్నాపురీ హల్వా తయారీ విధానం..
ముందుగా ఉడికించిన చిలగడదుంపలపై ఉండే పొట్టును తీసేసి మెత్తగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత రవ్వ వేసి వేయించాలి. రవ్వ వేగిన తరువాత మెత్తగా ,చేసుకున్న చిలగడదుంపలు వేసి కలపాలి. మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలి. చిలగడదుంప మిశ్రమాన్ని రంగు మారే వరకు వేయించిన తరువాత బెల్లం తురుము, యాలకుల పొడి వేసి కలపాలి. బెల్లం పూర్తిగా కరిగి హల్వా ఉడికి పూర్తిగా దగ్గర పడిన తరువాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రత్నాపూరీ హల్వా తయారవుతుంది. చిలగడదుంపలు ఎక్కువగా లభించే సమయంలో ఇలా వాటితో రుచికరమైన హల్వాను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని తినడం వల్ల రుచిగా ఉండడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని చెప్పడంలో సందేహం లేదు.