Rava Puri : సండే వచ్చిందంటే చాలు మనం స్పెషల్ గా వంటకాలతో స్పెషల్ అల్పాహారాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. ఇలా స్పెషల్ గా చేసే అల్పాహారాల్లో పూరీలు కూడా ఒకటి. పూరీలను చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే ఈ పూరీలను తయారు చేయడానికి మనం గోధుమపిండిని, మైదాపిండిని, పూరీ పిండిని ఉపయోగిస్తూ ఉంటాము. ఇవే కాకుండా మనం రవ్వతో కూడా పూరీలను చేసుకోవచ్చు. రవ్వతో చేసే ఈ పూరీలు చక్కగా పొంగడంతో పాటు మెత్తగా కూడా ఉంటాయి. రవ్వతో చక్కగా పొంగేలా పూరీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రవ్వ పూరీ తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ- ఒకటిన్నర కప్పు, ఉప్పు- కొద్దిగా, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
రవ్వ పూరీ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో బొంబాయి రవ్వ వేసి వీలైనంత మెత్తని పొడిలా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ రవ్వ పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో ఉప్పు వేసి కలపాలి. తరువాత 3 టీ స్పూన్ల నూనె వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా మరీ మెత్తగా ఉండకుండా చూసుకోవాలి. తరువాత పిండిపై మూత పెట్టి 30 నిమిషాల పాటు నానబెట్టాలి. తరువాత పిండిని మరోసారి అంతా కలుపుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇవి తడి ఆరిపోకుండా వాటిపై మూతను అలాగే ఉంచాలి. ఇప్పుడు ఒక్కో ఉండను తీసుకుంటూ నూనె రాసుకుంటూ చపాతీలా వత్తుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పూరీని వేసుకోవాలి.
పూరీని వేసిన వెంటనే గంటెతో నూనె లోపలికి వత్తాలి. ఇలా చేయడం వల్ల పూరీ చక్కగా పొంగుతుంది. ఈ పూరీలను పెద్ద మంటపై రెండు వైపులా చక్కగా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రవ్వ పూరీలు తయారవుతాయి. వీటిని చికెన్, మటన్ వంటి వంటకాలతో పాటు మసాలా కూరలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. రవ్వతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కూడా తయారు చేసుకుని తినవచ్చు.