Ravva Balls : మనం బొంబాయి రవ్వతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. బొంబాయి రవ్వతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. బొంబాయి రవ్వతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో రవ్వ బాల్స్ కూడా ఒకటి. రవ్వ బాల్స్ చాలా రుచిగా ఉంటాయి. వీటిని అల్పాహారంగా లేదా స్నాక్స్ గా కూడా తినవచ్చు. బొంబాయి రవ్వతో ఎంతో రుచిగా ఉండే రవ్వ బాల్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రవ్వ బాల్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ – ఒక కప్పు, గరం మసాలా – ఒక టీ స్పూన్, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
రవ్వ బాల్స్ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులో ఉప్పు, మిరియాల పొడి, అల్లం తరుగు వేసి కలపాలి. నీళ్లు వేడయ్యాక రవ్వ వేసి కలపాలి. దీనిని ఉండలు లేకుండా దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించాలి. రవ్వ దగ్గర పడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ నూనె ముద్దలా కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా రవ్వ మిశ్రమాన్ని తీసుకుంటూ బాల్స్ లాగా చుట్టుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఈ బాల్స్ ను ఆవిరి మీద 10 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత మరో కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి.
తరువాత కరివేపాకు, ఇంగువ, పసుపు, గరం మసాలా, కారం వేసి కలపాలి. తాళింపు వేగిన తరువాత ఉడికించిన బాల్స్ ను వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీరను వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రవ్వ బాల్స్ తయారవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. రవ్వతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కూడా తయారు చేసుకుని తినవచ్చు.