Rose Cookies : మనం సులభంగా చేసుకోదగిన తీపి వంటకాల్లో రోజ్ కుక్కీస్ కూడా ఒకటి. వీటినే గులాబి పువ్వులు అని కూడా అంటారు. రోస్ కుక్కీస్ చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు వీటిని మరింత ఇష్టంగా తింటారు. పండగలకు అలాగే అప్పుడప్పుడూ స్నాక్స్ గా తినడానికి వీటిని తయారు చేస్తూ ఉంటాము. అయితే చాలా మంది ఈ గులాబి పువ్వుల తయారీలో కోడిగుడ్లను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ కోడిగుడ్లను అందరూ తినరు. కొందరికి వాటి వాసన నచ్చదు. అలాంటి వారు కోడిగుడ్లు వేయకుండా కూడా ఈ గులాబి పువ్వులను తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసే గులాబి పువ్వులు కూడా చాలా రుచిగా ఉంటాయి. కోడిగుడ్లు వేయకుండా రుచిగా, క్రిస్పీగా గులాబి పువ్వులను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ లెస్ గులాబి పువ్వుల తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదాపిండి – ఒక కప్పు, బియ్యంపిండి – ఒక కప్పు, ఉప్పు – చిటికెడు, పంచదార – ముప్పావు కప్పు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
ఎగ్ లెస్ గులాబి పువ్వుల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో బియ్యంపిండి, పంచదార వేసి కలపాలి. తరువాత కొద్దిగా నీళ్లు పోసి పిండిని ముందుగా గట్టిగా కలుపుకోవాలి. తరువాత ఈ పిండిపై మూత పెట్టి 3 నుండి 4 గంటల పాటు నానబెట్టాలి. ఇలా నానబెట్టిన తరువాత తగినన్ని నీళ్లు పోసి మరలా కలుపుకోవాలి. పిండి మరీ పలుచగా, మరీ గట్టిగా కాకుండా చూసుకోవాలి. తరువాతకళాయిలో నూనె పోసి వేడి చేయాలి. ఇదే నూనెలో గులాబి పువ్వుల గుత్తిని ఉంచి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పూల గుత్తిని పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి. దీనిని 5 సెకన్ల పాటు అలాగే ఉంచి ఆ తరువాత పూల గుత్తిని కదపాలి. ఇలా చేయడం వల్ల గులాబి పువ్వులు గుత్తి నుండి వేరయ్యి నూనెలోకి వస్తాయి. మరలా ఈ పూల గుత్తిని నూనెలోనే ఉంచి మధ్యస్థ మంటపై పూలను కాల్చుకోవాలి. వీటిని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గులాబి పువ్వులు తయారవుతాయి. ఈ విధంగా చేయడం వల్ల కోడిగుడ్లు ఉపయోగించనప్పటికి గులాబి పువ్వులు చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి.