Saggubiyyam Chekkalu : మనం సాధారణంగా బియ్యం పిండితో పిండి వంటకమైన చెక్కలను తయారు చేస్తూ ఉంటాం. చెక్కలు ఎంత రుచిగా ఉంటాయో మనందరికి తెలిసిందే. వీటిని మనం పండగలకు ఎక్కువగా తయారు చేస్తూ ఉంటాం. ఈ చెక్కలల్లో మనం సగ్గుబియ్యం వేసి వీటిని మరింత రుచిగా కూడా తయారు చేస్తూ ఉంటాం. సగ్గుబియ్యంతో చేసే చెక్కలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మృదువుగా చాలా రుచిగా ఉంటాయి. సగ్గుబియ్యం వేసి గుల్లగుల్లగా రుచిగా చెక్కలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సగ్గు బియ్యం చెక్కలు తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం పిండి – పావు కిలో, నానబెట్టిన పెసరపప్పు – 2 టేబుల్ స్పూన్స్, నానబెట్టిన శనగపప్పు – 2 టేబుల్ స్పూన్స్, నానబెట్టిన సగ్గుబియ్యం – 2 టేబుల్ స్పూన్స్, అల్లం – ఒక ఇంచు ముక్క, పచ్చిమిర్చి – 3, కరివేపాకు – ఒక రెమ్మ, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, బటర్ – 2 టేబుల్ స్పూన్స్.
సగ్గు బియ్యం చెక్కల తయారీ విధానం..
ముందుగా జార్ లో పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత గిన్నెలో బియ్యం పిండిని తీసుకోవాలి. ఇందులో సగ్గుబియ్యం, పెసరపప్పు, శనగపప్పు, మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, కారం, ఉప్పు, బటర్ వేసి కలపాలి. తరువాత తగినన్ని వేడి నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి మరీ మెత్తగా మరీ గట్టిగా ఉండకుండా చూసుకోవాలి. ఇప్పుడు పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు పూరీ ప్రెస్ లో కవర్ ను ఉంచి దానికి నూనె రాయాలి.
తరువాత దీనిపై పిండి ముద్దను ఉంచి చెక్కలా వత్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వత్తుకున్న చెక్కలను వేసి కాల్చుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం చెక్కలు తయారవుతాయి. ఈ చెక్కలు రుచిగా, కరకరలాడుతూ ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి ఈ చెక్కలు చక్కగా ఉంటాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి.