Beetroot Fry : మనం బీట్ రూట్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బీట్ రూట్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. బీట్ రూట్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. రక్తపోటును అదుపులో ఉంచడంలో, రక్తహీనతను తగ్గించడంలో, మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో ఇలా అనేక రకాలుగా బీట్ రూట్ మనకు దోహదపడుతుంది. బీట్ రూట్ ను సలాడ్ గా, జ్యూస్ గా చేసుకుని తీసుకోవడంతో పాటు దీనితో మనం ఎంతో రుచిగా ఉండే ఫ్రైను కూడా తయారు చేసుకోవచ్చు. బీట్ రూట్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా సులభం. రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా బీట్ రూట్ తో ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బీట్ రూట్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్న ముక్కలుగా తరిగిన బీట్ రూట్ – 2 ( పెద్దవి), నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 8, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, పచ్చిమిర్చి – 8 లేదా కారానికి తగినన్ని, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్.
బీట్ రూట్ ఫ్రై తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత బీట్ రూట్ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలపాలి. ఇప్పుడు వీటిపై మూత పెట్టి ముక్కలను చక్కగా వేయించాలి. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ముక్కలుగా మెత్తబడే వరకు బాగా వేయించాలి. బీట్ రూట్ ముక్కలు చక్కగా వేగిన తరువాత మరోసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బీట్ రూట్ ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా బీట్ రూట్ ఫ్రైను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.