Sajja Burelu : స‌జ్జ‌ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన బూరెల త‌యారీ.. ఇలా చేస్తే ఇష్టంగా తింటారు..!

Sajja Burelu : మ‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో స‌జ్జ‌లు కూడా ఒక‌టి. స‌జ్జ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, చెడు కొలెస్ట్రాల్ స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో, షుగ‌ర్ ను నియంత్రించ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా స‌జ్జలు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి.

స‌జ్జ‌ల‌తో స‌జ్జ అన్నం, రొట్టెల‌తో పాటు మ‌నం ఎంతో రుచిగా ఉండే బూరెలను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. స‌జ్జ‌ల‌తో చేసే బూరెలు చ‌క్క‌గా పొంగి తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. స‌జ్జ బూరెల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఎవ‌రైనా వీటిని చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే స‌జ్జ బూరెల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Sajja Burelu recipe in telugu make in this method
Sajja Burelu

స‌జ్జ బూరెల త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

స‌జ్జ పిండి -రెండు కప్పులు, ఎండుకొబ్బ‌రి ముక్క‌లు – పావు క‌ప్పు, యాల‌కులు – 3, నెయ్యి -ఒక టేబుల్ స్పూన్, గ‌స‌గ‌సాలు – 2 టీ స్పూన్స్, బెల్లం తురుము – ముప్పావు క‌ప్పు, నీళ్లు – ఒక క‌ప్పు, ఉప్పు – కొద్దిగా, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

స‌జ్జ బూరెల త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో ఎండుకొబ్బ‌రి ముక్క‌లు, యాల‌కులు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడ‌య్యాక గ‌స‌గ‌సాల‌ను వేసి వేయించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న కొబ్బ‌రి వేసి కలిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో బెల్లం తురుము, నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం పూర్తిగా క‌రిగిన త‌రువాత ఉప్పు వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత స‌జ్జ పిండి, వేయించిన గ‌స‌గ‌సాలు, కొబ్బ‌రి మిశ్ర‌మం వేసి అంతా క‌లిసేలా గంటెతో క‌లుపుకోవాలి. ఈ మిశ్ర‌మం చ‌ల్లారిన త‌రువాత చేత్తో క‌లుపుకోవాలి.

త‌రువాత మందంగా ఉండే క‌వ‌ర్ ను తీసుకుని దానికి నూనె రాయాలి. త‌రువాత కొద్ది కొద్దిగా స‌జ్జ పిండి మిశ్ర‌మాన్ని తీసుకుంటూ బూరెలుగా వ‌త్తుకోవాలి. చేతుల‌కు నీటితో త‌డి చేసుకుంటూ వ‌త్తుకోవ‌డం వ‌ల్ల బూరెలు చ‌క్క‌గా వ‌స్తాయి. ఇలా వ‌త్తుకున్న బూరెల‌ను వేడి నూనెలో వేసి కాల్చుకోవాలి. ఈ బూరెల‌ను మ‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే స‌జ్జ బూరెలు త‌యార‌వుతాయి. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా స‌జ్జ పిండితో బూరెల‌ను త‌యారు చేసుకుని తిన‌డం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు.

D

Recent Posts