SBI : దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థల్లో నంబర్ వన్ సంస్థగా పేరున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. అతి తక్కువ ఈఎంఐతోనే ఎలక్ట్రిక్ టూవీలర్‌ను కొనుగోలు చేసే సౌకర్యాన్ని అందిస్తోంది. ఈ క్రమంలోనే ఎస్‌బీఐ ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్‌తో భాగస్వామ్యం అయింది.
ఎస్‌బీఐ వినియోగదారులు యోనో యాప్ ద్వారా హీరో ఎలక్ట్రిక్ టూవీలర్‌ను కొనుగోలు చేస్తే రూ.2000 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. అలాగే తక్కువ డాక్యుమెంటేషన్‌తో ఎలక్ట్రిక్ టూవీలర్ లోన్‌ను కూడా ఎస్‌బీఐ అందిస్తోంది. అలాగే యోనో యాప్ ద్వారా ఎస్‌బీఐ ఈజీ రైడ్ స్కీమ్‌లో భాగంగా నెలకు రూ.251 ఈఎంఐతోనే ఎలక్ట్రిక్ టూవీలర్ లోన్‌ను తీసుకోవచ్చు. వినియోగదారులు తీసుకునే ప్రతి రూ.10వేల లోన్‌కు నెలకు రూ.251 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. ఈ స్కీమ్‌లో భాగంగా వినియోగదారులు రూ.50వేల మేర వాహన రుణం తీసుకుంటే.. రూ.251 * 5 = రూ.1255 మాత్రమే నెలకు ఈఎంఐ అవుతుంది. ఇలా అతి తక్కువ ఈఎంఐతో ఎలక్ట్రిక్ టూవీలర్ లోన్‌ను తీసుకోవచ్చు.
వినియోగదారులకు ఈ సౌకర్యాన్ని అందించడం కోసం హీరో ఎలక్ట్రిక్ సంస్థతో భాగస్వామ్యం అయినట్లు ఎస్‌బీఐ తెలియజేసింది. కాగా పైన తెలిపిన స్కీమ్‌లో భాగంగా వినియోగదారులకు గరిష్టంగా 4 ఏళ్ల కాల పరిమితితో లోన్ ఇస్తారు. ఇక హీరో సంస్థకు దేశవ్యాప్తంగా 750 కి పైగా సేల్స్ అండ్ సర్వీస్ ఔట్‌లెట్లు ఉండగా.. అన్ని కేంద్రాల్లోనూ ఎస్‌బీఐ వినియోగదారులు ఈ ఆఫర్‌లను పొందవచ్చు.