Sorakaya Halwa : సొర‌కాయ‌తో ఎంతో రుచిక‌ర‌మైన హ‌ల్వా.. ఇలా చేయాలి..!

Sorakaya Halwa : సొర‌కాయ హ‌ల్వా.. దీనిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఎక్కువ‌గా ఫంక్ష‌న్స్ లో దీనిని త‌యారు చేస్తూ ఉంటారు. ఈ సొర‌కాయ హ‌ల్వాను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. ఎవ‌రైనా చాలా సుల‌భంగా ఈ సొర‌కాయ హ‌ల్వాను త‌యారు చేసుకోవ‌చ్చు. నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మృదువుగా, క్రీమీగా ఉండే ఈ సొర‌కాయ హ‌ల్వాను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

సొర‌కాయ హ‌ల్వా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నెయ్యి – 100 గ్రా., ఎండు ద్రాక్ష‌- 3 టేబుల్ స్పూన్స్, జీడిప‌ప్పు – 3 టేబుల్ స్పూన్స్, లేత సొర‌కాయ తురుము – 200 గ్రా., చిక్క‌టిపాలు – లీట‌ర్, పంచ‌దార – 150 గ్రా., ప‌చ్చి కోవా – 100 గ్రా., గ్రీన్ ఫుడ్ క‌ల‌ర్ – కొద్దిగా.

Sorakaya Halwa recipe in telugu very tasty
Sorakaya Halwa

సొర‌కాయ హ‌ల్వా త‌యారీ విధానం..

ముందుగా అడుగు మందంగా ఉండే క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. త‌రువాత జీడిప‌ప్పు, ఎండు ద్రాక్ష వేసి వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత అదే నెయ్యిలో సొర‌కాయ తురుము వేసి వేయించాలి. దీనిని ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించిన త‌రువాత పాలు పోసి క‌ల‌పాలి. పాలు ఒక పొంగు వ‌చ్చిన త‌రువాత మంట‌ను మ‌ధ్య‌స్దంగా చేసి పాలు 50 శాతం ఇగిరి పోయే వ‌రకు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత పంచ‌దార వేసి ఉడికించాలి. పాలు 80 శాతం ఇగిరి పోయి ద‌గ్గ‌ర ప‌డిన త‌రువాత ప‌చ్చికోవా వేసి క‌ల‌పాలి. త‌రువాత ఫుడ్ క‌ల‌ర్ వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో 5 నిమిషాల పాటు ఉడికించి వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి క‌లిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే సొర‌కాయ హ‌ల్వా త‌యార‌వుతుంది. ఇంటికి అతిథులు వ‌చ్చిన‌ప్పుడు, తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా సొర‌కాయ హల్వాను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts