Sorakaya Pachadi : మనం వంటింట్లో ఉపయోగించే కూరగాయల్లో సొరకాయ ఒకటి. సొరకాయను తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. బరువును తగ్గించడంలో సొరకాయలు ఎంతో సహాయపడతాయి. హైబీపీని, షుగర్ ను నియంత్రించడంలో సొరకాయలు ఉపయోగపడతాయి. జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. కాలేయాన్ని, మూత్ర పిండాలను శుభ్రపరచడంలో సొరకాయ దోహదపడుతుంది. సొరకాయలను తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతోపాటు ఎముకలు దృఢంగా తయారవుతాయి.
సొరకాయతో మనం రకరకాల వంటలను, ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. సొరకాయతో ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేయవచ్చు. సొరకాయతో చేసే పచ్చడి పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. సొరకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సొరకాయ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
లేత సొరకాయ – 1 (మధ్యస్థంగా ఉన్నది), చింత పండు – 15గ్రా., పచ్చి మిరపకాయలు – 12, వెల్లుల్లిపాయ – 1, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన కొత్తిమీర- కొద్దిగా, కరివేపాకు – ఒక రెబ్బ, నూనె- 2 టేబుల్ స్పూన్స్, ధనియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, మెంతులు- పావు టీ స్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, పసుపు – పావు టీ స్పూన్.
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండు మిర్చి – 2, కరివేపాకు – ఒక రెబ్బ, శనగ పప్పు – ఒక టీ స్పూన్, మినప పప్పు – ఒక టీ స్పూన్.
సొరకాయ పచ్చడి తయారీ విధానం..
ముందుగా సొరకాయను శుభ్రంగా కడిగి పొట్టు తీసుకోకుండానే ముక్కలుగా చేసుకోవాలి. తరువాత చింతపండును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లను పోసుకుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసి కాగాక పచ్చి మిరప కాయలను ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇందులోనే పొట్టు తీసిన వెల్లుల్లి పాయలను, ధనియాలను, జీలకర్రను, మెంతులను, కరివేపాకును వేసి మధ్యస్థ మంటపై పచ్చి మిరపకాయలు సగం వేగే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లగా అయ్యే వరకు పక్కకు పెట్టుకోవాలి.
ఇప్పుడు అదే కళాయిలో మరో టేబుల్ స్పూన్ నూనెను వేసి కాగాక సొరకాయ ముక్కలను వేసి పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇవి వేగాక పసుపును, రుచికి సరిపడా ఉప్పును వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక జార్ లో ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చి మిరప కాయలను, నాబెట్టుకున్న చింతపండును, తరిగిన కొత్తిమీరను వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఉడికించి పెట్టుకున్న సొరకాయ ముక్కలను, చింతపండును నానబెట్టుకున్న నీటిని కొద్దిగా వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కళాయిలో నూనె వేసి కాగాక తాళింపు పదార్థాలను వేసి తాళింపు చేసుకోవాలి. ఇలా చేసుకున్న తాళింపును ముందుగా చేసి పెట్టుకున్న సొరకాయ పచ్చడిలో వేసి కలుపుకోవాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే సొరకాయ పచ్చడి తయారవుతుంది. ఈ పచ్చడిని తాళింపు వేయకుండా కూడా చేసుకోవచ్చు. అన్నంతోపాటు చపాతీ, పుల్కా, దోశ, ఉతప్పం వంటి వాటితో కూడా కలిపి తినవచ్చు. సొరకాయతో ఇలా పచ్చడిని తయారు చేసుకొని తీసుకోవడం వల్ల ఎంతో రుచిగా ఉండడంతోపాటు ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది.