Sweet Corn Pakoda : స్వీట్ కార్న్ మనకు అన్ని వేళలా అందుబాటులో ఉంటుంది. సాధారణ కార్న్ అయితే కేవలం సీజన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కానీ స్వీట్ కార్న్‌ను మనం ఏడాది పొడవునా అన్ని సమయాల్లోనూ తెచ్చుకోవచ్చు. స్వీట్ కార్న్‌ను చాలా మంది ఉడికించి ఉప్పు, కారం, నెయ్యి వంటివి చల్లి తింటుంటారు. బయట మనకు బండ్ల మీద కూడా ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే స్వీట్ కార్న్‌తో ఎంతో టేస్టీగా ఉండే పకోడీలను కూడా చేసుకోవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. కాస్త శ్రమించాలే కానీ అద్భుతమైన స్వీట్ కార్న్ పకోడీ రెడీ అవుతుంది. అయితే ఈ పకోడీలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
స్వీట్ కార్న్ – ఒక కప్పు, శనగ పిండి – 3 టేబుల్ స్పూన్లు, బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్లు, మొక్క జొన్న పిండి – రెండు టేబుల్ స్పూన్లు, సన్నగా తరిగిన అల్లం, పచ్చి మిర్చి ముక్కలు – కొన్ని, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు కన్నా కొద్దిగా తక్కువగా, పుదీనా ఆకులు కొన్ని, నూనె వేయించడానికి సరిపడా, గరం మసాలా – 1 టీస్పూన్, ఉప్పు – తగినంత.
ముందుగా స్వీట్ కార్న్‌ని మిక్సీలో వేసి ఒక నిమిషం తిప్పితే కొద్దిగా నలుగుతాయి. వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో శనగపిండి, బియ్యం పిండి, మొక్కజొన్న పిండి, అల్లం, పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా ఆకుల తరుగు, గరం మసాలా, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. కావాలనుకుంటే కొన్ని నీళ్లు చల్లుకుని తడిపొడిగా కలుపుకోవచ్చు. బాణలిలో నూనె వేడి చేసి ఈ పిండిని పకోడీల్లా వేసుకోవాలి. ఎర్రగా వేగాక తీసేయాలి. వీటిని వేడి వేడిగా సాస్‌తో కలిపి తినవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటాయి. సాయంత్రం సమయంలో ఈ స్వీట్ కార్న్ పకోడీలను చేసి తింటే టేస్ట్ అదిరిపోతుంది. ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు.