Tomato Chips : మనం బియ్యం పిండితో రకరకాల పిండి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బియ్యంపిండితో చేసుకోదగిన పిండి వంటకాల్లో టమాట చిప్స్ కూడా ఒకటి. ఈ చిప్స్ కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే టమాట చిప్స్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. పిల్లలకు ఎంతో నచ్చే ఈ టమాట చిప్స్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట చిప్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
టమాటాలు -2, చిన్న ఉల్లిపాయ – 1, వెల్లుల్లి రెబ్బలు – 6, బియ్యం పిండి – ఒకటిన్నర కప్పు, వేడి నూనె లేదా నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, కసూరి మెంతి – అర టీ స్పూన్, రెడ్ చిల్లీ ఫేక్స్ -ఒక టీ స్పూన్, వాము – ఒక టీ స్పూన్, కారం – పావు టీ స్పూన్, చాట్ మసాలా – అర టీ స్పూన్, నూనె – డీప్ ప్రైకు సరిపడా.
టమాట చిప్స్ తయారీ విధానం..
ముందుగా టమాటాలు, ఉల్లిపాయను శుభ్రంగా కడగాలి. తరువాత వీటిని అక్కడక్కడ గాట్లు పెట్టాలి. ఇప్పుడు వీటిని పుల్కాల పెనం మీద ఉంచి టమాటాలపై ఉండే పొట్టు వేరయ్యే వరకు అటూ ఇటూ తిప్పుతూ కాల్చుకోవాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి. టమాటాలు, ఉల్లిపాయ చల్లారిన తరువాత వాటిపై ఉండే పొట్టును తీసేసి జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని వడకట్టి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో బియ్యం పిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో నెయ్యి లేదా నూనె వేసి కలుపుకోవాలి. తరువాత ఉప్పు, వాము. కసూరి మెంతి, చిల్లీ ప్లేక్స్ వేసి కలపాలి. తరువాత టమాట మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి. అవసరమైతే మరికొద్దిగా నీటిని పోసి పిండిని మెత్తగా కలుపుకోవాలి. అయితే పిండి మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి.
తరువాత పిండిపై మూతను ఉంచి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. పిండి నానిన తరువాత మరోసారి కలుపుకోవాలి. తరువాత పొడి పిండి చల్లుకుంటూ చపాతీలా వత్తుకోవాలి. ముందుగా అంచులను తీసేసి తరువాత మనకు కావాల్సిన ఆకారంలో చిప్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చిప్స్ ను వేసి వేయించాలి. వీటిని ముందుగా రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత అటూ ఇటూ తిప్పుతూ కాల్చుకోవాలి. చిప్స్ కరకరలాడుతూ చక్కగా వేగగానే తీసి ప్లేట్ లో వేసుకోవాలి. ఇలా అన్ని చిప్స్ ను కాల్చిన తరువాత ఒక గిన్నెలో రెండు చిటికెల ఉప్పు, కారం, చాట్ మసాలా వేసి కలపాలి.తరువాత ఈ మసాలాను చిప్స్ పై చల్లుకుని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇల చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట చిప్స్ తయారవుతాయి. వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. టీ టైం స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి.