Tomato Coriander Leaves Soup : టమాటాలను మనం వంటింట్లో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. టమాటాలతో మనం రకరకాల కూరలను, పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాం. టమాటాలతో చేసే వంటకమైన చాలా రుచిగా ఉంటుంది. కేవలం కూరలు, పచ్చళ్లే కాకుండా టమాటాలతో మనం ఎంతో రుచిగా ఉండే సూప్ ను కూడా తయారు చేసుకోవచ్చు. టమాట కొత్తిమీర కాడలు వేసి చేసే ఈ సూప్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం చాలా తేలిక. రుచిగా, కమ్మగా ఉండే టమాట కొత్తిమీర సూప్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట కొత్తిమీర సూప్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బటర్ – అర టీ స్పూన్, నూనె – ఒక టీ స్పూన్, దంచిన వెల్లుల్లి – 3, దంచిన అల్లం – అర ఇంచు ముక్క, యాలకులు – 3, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 2, బిర్యానీ ఆకు – 1, మిరియాలు – అర టీ స్పూన్, గోధుమపిండి – ఒక టీ స్పూన్, తరిగిన టమాటాలు – 3, కొత్తిమీర కాడలు – 100 గ్రా., కారం – అర టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 2, ఉప్పు – తగినంత, నీళ్లు – 500 ఎమ్ ఎల్.
టమాట కొత్తిమీర సూప్ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో బటర్, నూనె వేసి వేడి చేయాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు, అల్లం వేసి వేయించాలి. తరువాత యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. తరువాత గోధుమపిండి వేసి కలపాలి. గోధుమపిండి చక్కగా వేగిన తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. వీటిని మూడు నిమిషాల పాటు వేయించిన తరువాత కొత్తిమీర కాడలు వేసి కలపాలి. తరువాత కారం, పచ్చిమిర్చి వేసి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు కలుపుతూ వేయించాలి. టమాట ముక్కలు మెత్తగా అయిన తరువాత నీళ్లు, ఉప్పు వేసి కలపాలి. ఈ నీటిని చిన్న మంటపై 300 ఎమ్ ఎల్ అయ్యే వరకు బాగా మరిగించాలి.
తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని జల్లెడతో ఈ సూప్ ను వడకట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. వడకట్టుకునేటప్పుడు గంటెతో టమాట ముక్కలను బాగా వత్తుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా వేడి వేడిగా ఉండే టమాట కొత్తిమీర సూప్ తయారవుతుంది. దీనిని తాగడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు దీనిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు, నోటికి ఏది తినాలనిపించనప్పుడు ఈ విధంగా టమాట కొత్తిమీర సూప్ ను తయారు చేసుకుని తాగవచ్చు.