అన్ని కాలాల్లోనూ విరివిరిగా లభించే కూరగాయల్లో దొండకాయలు కూడా ఒకటి. దొండకాయలను కూడా మనం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. కానీ వీటిని తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ దొండకాయలను తినడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. దొండకాయల్లో శరీరానికి అవసరమయ్యే పోషకాలతోపాటు ఔషధ గుణాలు కూడా ఉంటాయి. ప్రాచీన కాలం నుండి ఆయుర్వేదంలో కూడా దొండకాయలను ఔషధంగా ఉపయోగిస్తున్నారు.
చర్మ సంబంధిత వ్యాధులను తగ్గించే గుణం దొండకాయల్లో పుష్కలంగా ఉంటుంది. దొండకాయల్లో విటమిన్ బి1, బి2, బి3, బి6, బి9, సి వంటి వాటితోపాటు పీచు పదార్థాలు, బీటా కెరోటీన్, కాల్షియం, మెగ్నిషియం వంటి ఇతర పోషకాలు కూడా ఉంటాయి. దొండకాయలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దగ్గు, ఆకలి లేమి వంటి వాటితో బాధపడే వారు దొండకాయలను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎముకలను దృఢంగా ఉంచడంలో, మూత్ర పిండాల్లో రాళ్లను తొలగించడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో దొండకాయలు మనకు సహాయపడతాయి.
దొండకాయలను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల పలు రకాల క్యాన్సర్ ల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దొండకాయలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల నోటిపూత, పెదవుల పగుళ్లు వంటి సమస్యలు త్వరగా నయం అవుతాయి. మానసిక ఆందోళన, మూర్ఛ వంటి వ్యాధులకు దొండకాయ చక్కని ఔషధంలా పని చేస్తుంది. వీటిలో ఉండే రైబోఫ్లేవిన్ మానసిక ఒత్తిడిని దూరం చేయడంలో దోహదపడుతుంది.
దొండకాయల్లో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేయడంలో తోడ్పడుతుంది. షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారికి దొండకాయ చక్కని ఆహారం. దీనిని పచ్చిగా లేదా కూరగా వండుకుని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి. దొండకాయలను ఎక్కువగా తింటే మంద బుద్ది వస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది కేవలం అపోహ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు.
దొండకాయలను పిల్లలకు తరచూ ఆహారంలో భాగంగా ఇవ్వడం వల్ల మెదడు పని తీరు మెరుగుపడి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. దొండకాయలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కనుక గర్భిణీలు దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవడం చాలా మంచిది. గజ్జి, తామర, అలర్జీ వంటి చర్మ వ్యాధులతో బాధపడుతున్నప్పుడు దొండచెట్టు ఆకులను మెత్తగా నూరి లేపనంగా రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దొండచెట్టు ఆకులను మెత్తగా నూరి నుదుటిపై రాయడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. ఈ విధంగా మన ఆరోగ్యాన్ని సంరక్షించడంలో దొండకాయలు ఎంతగానో ఉపయోగపడతాయని, వీటిని తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు సూచిస్తున్నారు.