Tomato Upma : ఉదయం మనం సహజంగానే పలు రకాల బ్రేక్‌ఫాస్ట్‌లను చేస్తుంటాం. వాటిల్లో ఉప్మా కూడా ఒకటి. దీన్ని చాలా మంది తినేందుకు ఇష్టపడరు. అయితే ఉప్మా అంటే ఎంత నచ్చని వారు అయినా సరే కింద చెప్పిన విధంగా ఉప్మాను ఓ వెరైటీ స్టైల్‌లో చేస్తే చాలు.. నోరూరించుకుంటూ మొత్తం తినేస్తారు. ఎందుకంటే ఈ ఉప్మా ఎంతో టేస్టీగా ఉంటుంది కాబట్టి. ఈ ఉప్మాను ఎవరైనా సరే ఈజీగా చేయవచ్చు. ఇక సాధారణ ఉప్మాకు, దీనికి తేడాలేమిటి.. ఈ ఉప్మాను ఎలా చేయాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాటా ఉప్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
రవ్వ – ఒక కప్పు, నూనె లేదా నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు, ఆవాలు – ఒక టీస్పూన్, జీలకర్ర – ఒక టీస్పూన్, మినప పప్పు – అర టీస్పూన్, శనగలు – అర టీస్పూన్, ఉల్లిపాయలు – 1 (సన్నగా తరగాలి), పచ్చి మిర్చి – 1 (సన్నగా తరగాలి, కారం ఇంకా కావాలనుకుంటే ఇంకో రెండు మూడు వేసుకోవచ్చు), తురిమిన అల్లం – ఒక టీస్పూన్, టమాటాలు – 2 (మీడియం సైజువి, సన్నగా తరగాలి), పసుపు – అర టీస్పూన్, కారం (అవసరం అనుకుంటే) – అర టీస్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, నీళ్లు – రెండు కప్పులు, కొత్తిమీర (సన్నగా తరిగినవి) – గార్నిష్ కోసం, నిమ్మకాయ ముక్కలు – కొన్ని (సర్వింగ్ చేసుకునేందుకు).
టమాటా ఉప్మాను తయారు చేసే విధానం..
ఒక పాత్ర తీసుకుని స్టవ్ మీద పెట్టాలి. అందులో నూనె లేదా నెయ్యి వేసి మీడియం మంటపై కాగబెట్టాలి. నూనె కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి. తరువాత జీలకర్ర, మినప పప్పు, శనగలు వేసి వేయించాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తరువాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, తురిమిన అల్లం వేసి వేయించాలి. ఇవి బాగా వేగిన తరువాత తరిగిన టమాటాలు వేసి అవి మృదువుగా, మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. అనంతరం పసుపు, కారం, ఉప్పు వేసి ఒక నిమిషం పాటు బాగా కలుపుతూ వేయించాలి.
ఇప్పుడు ఇంకో పాన్ తీసుకుని అందులో రవ్వ వేసి సన్నని మంటపై వేయించాలి. రవ్వ సువాసన వస్తూ లేత బంగారు రంగులోకి మారగానే స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు టమాటా మిశ్రమంలో రెండు కప్పుల నీళ్లను పోయాలి. అనంతరం మరిగించాలి. మంటను కాస్త తగ్గించి మరుగుతున్న నీటిలో ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను నెమ్మదిగా వేస్తూ బాగా కలపాలి. రవ్వ ఉండలుగా చుట్టుకుపోకుండా బాగా కలపాల్సి ఉంటుంది. ఇప్పుడు రవ్వ బాగా కలిసింది అనుకుంటే దాన్ని సన్నని మంటపై 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించాలి. దీంతో రవ్వ ఇంకాస్త గట్టి పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. పాన్ మీద మూత పెట్టాలి. దీన్ని 2 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అనంతరం మూత తీసి దాన్ని మళ్లీ ఒకసారి కలపాలి.
అనంతరం ఉప్మాపై తరిగిన కొత్తిమీర, నిమ్మకాయ ముక్కలు వేసి గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. దీంతో ఎంతో టేస్టీగా ఉండే టమాటా ఉప్మా రెడీ అవుతుంది. దీనిపై నిమ్మకాయ రసం పిండి తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇలా తయారైన టమాటా ఉప్మాను నేరుగా అలాగే తినవచ్చు. లేదా కొబ్బరి, పల్లి చట్నీలతో కలిపి కూడా తినవచ్చు. దీన్ని ఉదయం బ్రేక్‌ఫాస్ట్ లేదా మధ్యాహ్నం లంచ్‌లోనూ తినవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ చేసే ఉప్మా కాకుండా ఇలా ఒక్కసారి కొత్తగా ట్రై చేయండి. టేస్ట్ చూస్తే మళ్లీ ఇలాగే చేసుకుంటారు.