Vastu Tips : సాధారణంగా ఇంట్లో కొన్ని వస్తువులను పెట్టుకుంటే శుభమని, కొన్ని వస్తువులను పెట్టుకోవడం వల్ల అశుభమని చెడు ఫలితాలు కలుగుతాయని నానుడి. ఎంత కష్టపడినా చేతిలో చిల్లు గవ్వ మిగలడం లేదని బాధపడే వారు మనలో మంది ఉండే ఉంటారు. అలాగే కొన్ని వస్తువులు, ఫోటోలు మంచిని సూచిస్తే, కొన్ని చెడును ఆహ్వానిస్తాయి. చెడును ఆహ్వానించే వస్తువులను ఇంట్లో నుండి తొలగిస్తే మంచిది. అలాగే ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
కొన్ని వస్తువులను తెలిసో తెలియకో ఇంట్లో కనుక పెట్టుకుని ఉంటే వెంటనే తొలగించడం మంచిది. వీటిని తొలగించడం వల్ల సంతోషం, మనశ్శాంతి లభిస్తాయి. ఈ వస్తువులను కనుక తొలగించకపోతే అవి ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి. ఆరోగ్యంగా అలాగే ఆర్థికంగా కూడా ఇవి దెబ్బతీస్తాయి. ఇంట్లో ఉంచకూడని వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో కనుక ఏడుస్తున్న బాలుడు లేదా బాలిక పెయింటింగ్స్ ఉంటే వాటిని వెంటనే తొలగించాలి. ఇవి దురదృష్టానికి సంకేతం. వీటిని ఇంట్లో పెట్టుకోకూడదు.
అలాగే ఇంట్లో పూలు, పండ్లు లేని చెట్లను ఉంచుకోకూడదు. ఇవి కూడా దురదృష్టాన్ని సూచిస్తాయి. సాధారణంగా నటరాజుని పెయింటింగ్ ను కూడా చాలా మంది ఇంట్లో ఉంచుకుంటారు. ఇది మంచిగా కళాత్మకంగా ఉన్నప్పటికీ ఇది కూడా చెడును సూచిస్తుంది. తాండవ నృత్యం అంటే వినాశనానికే నృత్యం అని సూచిస్తుంది. అందుకే ఈ పెయింటింగ్ ను కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. క్రూర జంతువులైన పులులు, సింహాలు, తోడేళ్ల వంటి జంతువుల ఫోటోలను కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. ఇవి మనుషుల్లోని హింసాప్రవృత్తిని సూచిస్తాయి. అందువల్ల ఈ పెయింటింగ్స్ ను కూడా ఇంట్లో ఉంచుకోకూడదు.
ఇక పడిపోతున్న, నాశనమవుతున్న, నీటిలో మునిగిపోతున్న పడవలకు సంబంధించిన ఫోటోలను లేదా వస్తువులను ఇంట్లో ఉంచుకోకూడదు. మునుగుతున్నట్టు ఉన్న పడవ చిత్ర పటం ఇంట్లో ఉంటే ఆ పడవ కుటుంబ సభ్యుల మధ్య బంధాలను దిగజారుస్తుంది. ఇలాంటి వస్తువులు గనుక ఇంట్లో ఉంటే వెంటనే తొలగించాలి. ఇంటి అలంకరణ కోసం కొందరు ఇంట్లో వాటర్ ఫౌంటెయిన్ లను ఉంచుకుంటారు. ఇది చూడడానికి అందంగా ఉన్నప్పటికీ దీని వల్ల నష్టం కలుగుతుంది. చాలా మంది నీటిని ఎంత వృథా చేస్తే అంతగా డబ్బు వృథా అవుతుందని నమ్ముతూ ఉంటారు. వాటర్ ఫౌంటేన్ లో నీరు ఎప్పుడూ ధారాళంగా ప్రవహించడం వల్ల డబ్బు కూడా అలానే వృథా అవుతుంది. కనుక ఇంట్లో వాటర్ ఫౌంటేన్ ను ఉంచుకోకూడదు.
అలాగే చెప్పుల స్టాండ్ ను కూడా ఇంట్లో ఎట్టి పరిస్థిత్తుల్లో ఉంచుకోకూడదు. చెప్పుల స్టాండ్ ను ఇంటి వెలుపలే పెట్టుకోవాలి. చెప్పులను ఇంట్లో ఉంచుకోవడం వల్ల అనారోగ్యాల బారిన పడడమే కాదు దురదృష్టానికి సంకేతం. అదేవిధంగా ఎప్పటికప్పుడు చెత్తా చెదారాన్ని తొలగిస్తూ ఉండాలి. కుప్పలు లేదా మూలల్లో తోయడం వల్ల ఇంట్లో వ్యతిరేక వాతావరణం ఉంటుంది. అలాగే పూజకు ఉపయోగించే పువ్వులు తాజావి అయ్యే ఉండాలి. అలాగే వాడిన పువ్వులను వెంటనే తొలగించాలి. వాడిన పువ్వులు ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీని తీసుకు వస్తాయి. ఇంట్లో ముళ్ల జాతికి చెందిన మొక్కలను కూడా ఉంచుకోకూడదు. ఇవి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులకు కారణమవుతాయి.
రావి చెట్టుకు హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. కానీ ఈ చెట్టును ఇంటి ఆవరణలో ఉంచుకోకూడదు. దీనిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఇంట్లో వారిపై ఒత్తిడి ఎక్కువవుతుంది. అలాగే తులసి మొక్కను కూడా మనం పూజిస్తూ ఉంటాం. కానీ ఈ మొక్కను ఎక్కడపడితే అక్కడ పెట్టకూడదు. తులసి చెట్టును సరైన చోట పెడితేనే దానిని పూజించడం వల్ల కలిగే ఫలితాలను పొందవచ్చు. తులసి చెట్టును దక్షిణ దిక్కున మూలలో పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
తాజ్ మహల్ ప్రేమకు చిహ్నమైనప్పటికీ దీనిని ముమ్ తాజ్ సమాధిగా షాజహాన్ నిర్మించారు. అది ఒక సమాధి కావడం వల్ల చెడు ఫలితాలు ఉంటాయని అందుకే ఇంట్లో పెట్టుకోకూడదని అంటారు. నగ్న చిత్రాలను కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. ఇవి దురదృష్టాన్ని సూచిస్తాయి. అలాగే రామాయణ, మహాభారతాల నుండి యుద్ద చిత్రాలను ఇంట్లో ఉంచుకోకూడదు. పైన తెలిపిన వస్తువులు కానీ పెయింటింగ్స్ కానీ ఇంట్లో ఉంటే వెంటనే తీసి వేయాలి. ఇలా చేయడం వల్ల సమస్యల నుండి బయటపడవచ్చు.