Aloo Tikki : బంగాళాదుంపలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కూరలతోపాటు వీటితో వివిధ రకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. వాటిల్లో ఆలూ టిక్కి కూడా ఒకటి. ఆలూ టిక్కిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఇవి ఎక్కువగా బయట లభిస్తాయి. ఎంతో రుచిగా ఉంటే ఈ ఆలూ టిక్కిని మనం ఇంట్లో కూడా చాలా సుభంగా తయారు చేసుకోవచ్చు. ఆలూ టిక్కిని రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ టిక్కి తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన బంగాళాదుంపలు – 3 (మధ్యస్థంగా ఉన్నవి), అటుకులు – అర కప్పు, బ్రెడ్ క్రంబ్స్ – అర కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, క్యారెట్ తురుము – పావు కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన కరివేపాకు – కొద్దిగా, పసుపు – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – అర టీ స్పూన్, చాట్ మసాలా – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ఆమ్ చూర్ పొడి – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు – ఒక టేబుల్ స్పూన్, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
ఆలూ టిక్కి తయారీ విధానం..
ముందుగా ఉడికించిన బంగాళాదుంపల పొట్టు తీసి మెత్తగా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఒక జార్ లో అటుకులను వేసి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని కూడా బంగాళాదుంపల మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఒక గిన్నెలో మైదాపిండిని, నీళ్లను పోసి పేస్ట్ లా కలుపుకోవాలి. అలాగే ఒక ప్లేట్ లో బ్రెడ్ క్రంబ్స్ ను తీసుకోవాలి. ఇప్పుడు బంగాళాదుంప మిశ్రమాన్ని తగిన మోతాదులో తీసుకుని కట్ లెట్ ల ఆకారంలో వత్తుకోవాలి. తరువాత వీటిని మైదా పిండి మిశ్రమంలో ముంచి తీసి బ్రెడ్ క్రంబ్స్ లో వేయాలి. బ్రెడ్ క్రంబ్స్ కట్ లెట్ కు అంటేలా బాగా చూసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న కట్ లెట్స్ ను ప్లేట్ లోకి తీసుకుని ఒక గంట పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కట్ లెట్స్ ను నూనెలో వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. వీటిని డీప్ ఫ్రై చేయడం ఇష్టం లేనివారు కట్ లెట్ లను పలుచగా చేసుకుని పెనం మీద వేసి నూనె వేస్తూ కాల్చుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ టిక్కి తయారవుతుంది. దీనిని టమాట కెచప్, గ్రీన్ చట్నీలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా బంగాళాదుంపలతో ఇలా ఆలూ టిక్కిని తయారు చేసుకుని తినవచ్చు.