Vellulli Rasam : చలికాలం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అన్నే అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. ఈ కాలంలో శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండడం చాలా అవసరం. లేదంటే మనం తరుచూ అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండేలా చేసుకోవాలి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాల్లో వెల్లుల్లి కూడా ఒకటి. దీనిని తీసుకోవడం వల్ల మనం అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. వెల్లుల్లి ఆహారంలో భాగంగా తీసుకోవడంతో పాటు దీనితో మనం ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి రసాన్ని కూడా చేసుకోవచ్చు. ఇలా వెల్లుల్లి రసాన్ని చేసి తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు చలి నుండి ఉపశమనాన్ని కూడా పొందవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ వెల్లుల్లి రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వెల్లుల్లి రసం తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన చింతపండు – నిమ్మకాయంత, తరిగిన టమాట – 1, కాల్చిన పచ్చిమిర్చి – 2, వెల్లుల్లి రెబ్బలు – 20, నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు -అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, ఉప్పు – తగినంత, ఇంగువ – పావు టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, నీళ్లు – తగినన్ని, తరిగిన కొత్తిమీర – పిడికెడు.
మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
మెంతులు – పావు టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ధనియాలు -ఒక టీ స్పూన్, కందిపప్పు – 2 టీ స్పూన్స్, నువ్వు లు – ఒక టీ స్పూన్.
వెల్లుల్లి రసం తయారీ విధానం..
ముందుగా కళాయిలో మసాలా పొడికి కావల్సిన పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత చింతపండు నానబెట్టిన గిన్నెలోనే టమాట ముక్కలు, పచ్చిమిర్చి వేసి చేత్తో బాగా నలిపి రసాన్ని తీసుకోవాలి. తరువాత ఇందులో ఉండే పిప్పిని తీసేసి రసాన్ని పక్కకు ఉంచాలి. తరువాత రోట్లో వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి.
తరువాత ఇంగువ, కరివేపాకు, దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. తరువాత చింతపండు రసం, నీళ్లు, ముందుగా తయారు చేసుకున్న పొడి వేసి కలపాలి. దీనిని 2 పొంగులు వచ్చే వరకు మరిగించి ఆ తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి రసం తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా వెల్లుల్లి రెబ్బలతో రసాన్ని చేసి తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.