White Kalakand : పాలతో మనం రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. పాలతో చేసే తీపి వంటకాల్లో కలాకంద్ కూడా ఒకటి. కలాకంద్ ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మనకు స్వీట్ షాపుల్లో ఈ తీపి వంటకం విరివిరిగా లభిస్తూ ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత కమ్మగా ఉండే ఈ కలాకంద్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడానికి సమయం ఎక్కువగా పట్టినప్పటికి చేయడం మాత్రం సులభం. ఎంతో రుచిగా ఉండే కలాకంద్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కలాకంద్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చిక్కటి పాలు – ఒక లీటర్, నిమ్మరసం – 2 టీ స్పూన్స్, పంచదార – 100 గ్రా..
కలాకంద్ తయారీ విధానం..
ముందుగా అడుగు మందంగా ఉండే కళాయిలో పాలు పోసి వేడి చేయాలి. పాలను మీగడ కట్టకుండా కలుపుతూ వేడి చేయాలి. ఇలా పాలను సగం అయ్యే వరకు మరిగించిన తరువాత నిమ్మరసం వేసి కలపాలి. నిమ్మరసం వేయడం వల్ల పాలు విరుగుతాయి. వీటిని కలుపుతూ ఉడికించాలి. పాలు పూర్తిగా విరిగిన తరువాత పంచదార వేసి కలపాలి. పంచదార కరిగిన తరువాత దీనిని కళాయికి అంటుకోకుండా వేరయ్యే కలుపుతూ ఉడికించాలి. పాల మిశ్రమం పూర్తిగా దగ్గర పడిన తరువాత దీనిని నెయ్యి రాసిన గిన్నెలోకి తీసుకోవాలి. పైన అంతా సమానంగా చేసుకుని పూర్తిగా చల్లారే వరకు ఉంచాలి. తరువాత దీనిని ప్లేట్ లోకి తీసుకుని మనకు కావాల్సిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కలాకంద్ తయారవుతుంది. ఈ విధంగా పాలతో ఎంతో రుచిగా ఉండే కలాకంద్ ను ఇంట్లోనే తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.