Tandoori Roti : బయట మనం రెస్టారెంట్‌లకు వెళితే.. అక్కడ భిన్న రకాల రోటీలు లభిస్తాయి. వాటిల్లో తందూరి రోటీ ఒకటి. దీన్ని వివిధ రకాల కూరలతో తింటారు. అయితే తందూరీ రోటీలు కేవలం హోటల్స్ లో మాత్రమే లభిస్తాయా.. ఇంట్లో చేసుకోలేమా.. అంటే.. చేసుకోవచ్చు. కాస్త శ్రమించాలే కానీ తందూరీ రోటీలను ఇంట్లో ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇక వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తందూరీ రోటీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదా పిండి – 2 కప్పులు, గోధుమ పిండి – ఒక కప్పు, ఉప్పు – అర టీ స్పూన్, పంచదార – ఒక టీ స్పూన్, బేకింగ్ పౌడర్ – అర టీ స్పూన్, నూనె – 3 టీ స్పూన్స్, పెరుగు – అర కప్పు, గోరు వెచ్చని నీళ్లు – తగినన్ని.
తందూరీ రోటీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ముందుగా ఒక గిన్నెలో మైదాపిండి, గోధుమ పిండి, ఉప్పు, పంచదార, బేకింగ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత నూనె, పెరుగును వేసి కలుపుకోవాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లను పోసుకుంటూ చపాతీ పిండి కంటే కొద్దిగా మెత్తగా ఉండేలా చేత్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిపై కొద్దిగా నూనెను రాసి మూత పెట్టి 20 నిమిషాల పాటు ఉంచాలి. ఇప్పుడు మూత తీసి మరో సారి పిండిని బాగా కలిపి కావల్సిన పరిమాణంలో ముద్దలుగా చేసుకోవాలి. ఇప్పుడు పొడి పిండిని వేసుకుంటూ అటూ ఇటూ తిప్పకుండా ఒక వైపు మాత్రమే వత్తుతూ కొద్దిగా మందంగా ఉండేలా చపాతీలా చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద లోతుగా ఉండే ఒక ఇనుప కళాయిని ఉంచి వేడి చేయాలి. కళాయి వేడయ్యాక ముందుగా తయారు చేసుకున్న రోటీకి కర్రతో వత్తిన వైపు నీటిని రాసి కళాయికి అంటించాలి. ఈ విధంగా కళాయికి ఒకేసారి మూడు లేదా నాలుగు రోటీలను అంటించవచ్చు. కళాయికి అంటించిన తరువాత రోటీ నుండి బుడగలు రావడాన్ని మనం గమనించవచ్చు. బుడగలు వచ్చినప్పుడు కళాయిని నుండి రోటీని తీసి నేరుగా మంటపై ఉంచి మంటను సరి చూసుకుంటూ కాల్చుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు బయట దొరికే విధంగా ఉండే తందూరీ రోటీలు తయారవుతాయి. ఇలా చేసుకున్న తుందూరీ రోటీలు అచ్చం మనకు బయట దొరికే వాటిలా ఉంటాయి. ఇలా చేసుకున్న తందూరీ రోటీలను వెజ్, నాన్ వెజ్ కూరలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.