పోష‌ణ‌

మన శరీరానికి అవసరమయ్యే స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాల గురించి తెలుసా..?

మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవాలని అందరికీ తెలిసిందే. అయితే పోషకాలు అంటే.. సాధారణంగా చాలా మంది విటమిన్లు, మినరల్స్ మాత్రమేననుకుంటారు. కానీ అది పొరపాటు. ఎందుకంటే పోషకాలు రెండు రకాలు. అవి 1. స్థూల పోషకాలు. 2. సూక్ష్మ పోషకాలు. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

స్థూల పోషకాలు…

కార్బొహైడ్రేట్లు (పిండి పదార్థాలు), ప్రోటీన్లు (మాంసకృత్తులు), ఫ్యాట్స్ (కొవ్వులు).. ఈ మూడింటినీ స్థూల పోషకాలు అని అంటారు. ఎందుకంటే ఇవి నిత్యం మన శరీరానికి పెద్ద మొత్తంలో అవసరం అవుతాయి. అందుకనే వీటిని స్థూలపోషకాలు అంటారు. ఇక వీటిలో కార్బొహైడ్రేట్ల వల్ల మనకు శక్తి లభిస్తుంది. నిత్యం మనం యాక్టివ్‌గా పనిచేసేందుకు కావల్సిన శక్తి మనకు వీటివల్లే లభిస్తుంది. అలాగే ప్రోటీన్ల వల్ల మన శరీరంలో కండరాలు నిర్మాణమవుతాయి. పాత కణజాలం పోయి కొత్త కణజాలం ఏర్పడుతుంది. శరీర నిర్మాణం జరుగుతుంది. ఇక కొవ్వులతో మన శరీరం భవిష్యత్ శక్తి అవసరాలకు కావల్సిన ఆహారాన్ని నిల్వ చేసుకుంటుంది. అలాగే పలు విటమిన్లు, మినరల్స్‌ను మన శరీరం సరిగ్గా శోషించుకునేందుకు కూడా కొవ్వులు పనికొస్తాయి.

do you know about micro and macro nutrients

సూక్ష్మ పోషకాలు…

మన శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్‌ను సూక్ష్మ పోషకాలు అంటారు. ఇవి నిత్యం మనకు చాలా తక్కువ మోతాదులో అవసరం అవుతాయి. అందుకనే వీటిని సూక్ష్మ పోషకాలు అంటారు. వీటిల్లో అనేక రకాలు ఉంటాయి. విటమిన్ ఎ, బి1 (థయామిన్), బి2 (రైబోఫ్లేవిన్), బి3 (నియాసిన్), బి5 (పాంటోథెనిక్ యాసిడ్), బి6 (పైరిడాక్సిన్), బి7 (బయోటిన్), బి9 (ఫోలేట్), బి12 (సయానో కోబాలమిన్), విటమిన్ సి (ఆస్కార్బిక్ యాసిడ్), విటమిన్ డి (డి3), ఇ, కె, కె2లు విటమిన్ల జాబితాలోకి వస్తాయి. అలాగే కాల్షియం, పాస్ఫరస్, మెగ్నిషియం, సోడియం, క్లోరైడ్, పొటాషియం, సల్ఫర్, ఐరన్, మాంగనీస్, కాపర్, జింక్, అయోడిన్, ఫ్లోరైడ్, సెలీనియం తదితర పదార్థాలను మినరల్స్ అంటారు. మనకు విటమిన్లు, మినరల్స్ నిత్యం అవసరం అవుతాయి. అయితే ఆడ, మగ, పిల్లా పెద్దా వయస్సును బట్టి ఆయా విటమిన్లు, మినరల్స్‌ను నిత్యం మనం తీసుకోవాల్సిన మోతాదులు మారుతుంటాయి. ఈ క్రమంలో ఎవరైనా సరే.. నిత్యం తమ ఆహారంలో అన్ని స్థూల పోషకాలు, అన్ని సూక్ష్మ పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఆయా పోషకాలు ఉండే ఆహారాలను నిత్యం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు..!

Admin

Recent Posts