Papaya : మనం అనేక రకాల పండ్లను తింటూ ఉంటాం. పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వైద్యులు కూడా పండ్లను ఆహారంగా తీసుకోమని మనకి సూచిస్తూ ఉంటారు. పండ్లల్లో మనకు అవసరమయ్యే ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్ తో పాటు అనేక రకాల పోషకాలు కూడా ఉంటాయి. పండ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మనకు విరివిరిగా అందుబాటులో తక్కువ ధరలో లభించే పండ్లల్లో బొప్పాయి పండు కూడా ఒకటి. మన ఆరోగ్యానికి, సౌందర్యానికి బొప్పాయి పండు ఎంతో మేలు చేస్తుంది. బొప్పాయి పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బొప్పాయి పండు మనకు సంవత్సరమంతా లభిస్తూ ఉంటుంది.
మన దేశంలో ఈ పండును విరివిరిగా సాగూ చేస్తూ ఉంటారు. డెంగ్యూ జ్వరం నుండి బయటపడడానికి వైద్యులు కూడా బొప్పాయిని తీసుకోమని సూచించడంతో బొప్పాయి పండుకు ఎంతో గిరాకీ పెరిగింది. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు ఔషధంగా పని చేస్తుంది. బొప్పాయి పండులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె లతో బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఐరన్, మాంగనీస్, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం వంటి మినరల్స్ తో పాటు ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. బొప్పాయిని తీసుకోవడం వల్ల మన శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. దీనిలో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. దీంతో బరువు తగ్గాలనుకునే వారు కూడా దీనిని ఆహారంగా తీసుకోవచ్చు. మన శరీరంలో జీవక్రియలు సాఫీగా సాగేలా చేయడంలో కూడా బొప్పాయి పండు మనకు ఉపయోగపడుతుంది.
రోజుకు ఒక బొప్పాయి ముక్కను తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కనుక భోజనం తరువాత దీనిని తీసుకుంటే జీర్ణశక్తి మెరుగుపడి మలబద్దకం సమస్య తగ్గుతుంది. ప్రేగులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ లు ఉంటాయి. ఇవి యాంటీఇన్ ప్లామేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. కీళ్‌ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు బొప్పాయి పండును తీసుకోవడం వల్ల నొప్పులు, వాపులు వంటి సమస్యలు తగ్గుతాయి. బొప్పాయి పండును తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ నశించి అనారోగ్యాల బారిన పడకుండా ఉంటాము. కంటి చూపును మెరుగుపరచడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా బొప్పాయి పండు మనకు ఉపయోగపడుతుంది.
కేవలం మన ఆరోగ్యానికే కాదు మన అందాన్ని కాపాడడంలో కూడా బొప్పాయి పండు మనకు ఉపయోగపడుతుంది. దీనిలో అధికంగా ఉండే విటమిన్ ఇ చర్మం పై ముడతలు రాకుండా చేస్తుంది. వృద్ధాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. బొప్పాయి పండును గుజ్జుగా చేసి ముఖానికి రాసుకుంటూ ఉంటే ముఖం పై మచ్చలు, మొటిమలు తగ్గి ముఖం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. బొప్పాయి పండు మన ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికి దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు కూడా తలెత్తుతాయి. రోజు ఒక పెద్ద ముక్క కంటే ఎక్కువగా ఈ బొప్పాయిని తీసుకోకూడదు. బొప్పాయిని అధికంగా తీసుకోవడం వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
గర్భిణీ స్త్రీలు బొప్పాయి పండును అస్సలు తీసుకోకూడదు. దీనిలో పెపిన్ అధిక మోతాదులో ఉంటుంది. దీని కారణంగా గర్భస్రావం అయ్యే అవకాశం ఉంది. అలాగే బొప్పాయి పండును కోసేటప్పుడు వచ్చే పాలు కొందరిలో దురదను కలిగిస్తాయి. అలాదే కొందరిలో ఈ పండు దురదను కూడా కలిగిస్తుంది. దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు, కెరెటెమియా అనే వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే బొప్పాయి ఆకు రసాన్ని తాగడం వల్ల రక్తంలో ప్లేట్ లెట్స్ సంఖ్య పెరుగుతుందన్ని విషయం మనకు తెలిసిందే.
అయితే ఈ ఆకుల రసాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశం ఉంది. అలాగే అధికంగా జ్వరం ఉన్నప్పుడు కూడా బొప్పాయి పండును ఎక్కువగా తీసుకోకూడదు. పురుషులు ఎక్కువగా బొప్పాయి పండును తీసుకోకూడదు. దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల వారిలో వీర్య కణాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. షుగర్ తో బాధపడే వారు కూడా ఈ పండును ఎక్కువగా తీసుకోకూడదు.