Pudina Pachadi : పుదీనాతో ప‌చ్చ‌డి కూడా చేయ‌వ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది.. అస‌లు విడిచిపెట్ట‌రు..

Pudina Pachadi : పుదీనా.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. పుదీనా చ‌క్క‌టి వాస‌న‌ను క‌లిగి ఉంటుంది. దీనిని గార్నిష్ కోసం ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటాం. పుదీనాను వేయ‌డం వ‌ల్ల మ‌నం చేసే వంట‌ల రుచి, వాస‌న పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. పుదీనా చ‌క్క‌టి వాస‌న‌తో పాటు ఔష‌ధ గుణాల‌ను కూడా ఉంది. జీర్ణ‌శ‌క్తిని పెండ‌చంలో, మెద‌డు ప‌నితీరును మెరుగుప‌ర‌చ‌డంలో, నోటి దుర్వాస‌న‌ను త‌గ్గించ‌డంలో పుదీనా మ‌న‌కు ఎంతో దోహ‌ద‌ప‌డుతుంది. వంట‌ల్లో ఉప‌యోగించ‌డ‌మే కాక పుదీనాతో మ‌నం ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. పుదీనాతో చేసే ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా సుల‌భం. రుచిగా, సులువుగా ఈ పుదీనా ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పుదీనా ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పుదీనా క‌ట్ట‌లు – 2 ( పెద్ద‌వి), ఎండుమిర్చి – 15 లేదా త‌గిన‌న్ని, నాన‌బెట్టిన చింత‌పండు – చిన్న నిమ్మ‌కాయంత‌, నూనె – ఒక టీ స్పూన్, ధ‌నియాలు – 2 టేబుల్ స్పూన్స్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, క‌రివేపాకు – రెండురెమ్మ‌లు, మెంతి గింజ‌లు – 10, ఉప్పు – త‌గినంత‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 8.

Pudina Pachadi recipe in telugu make in this way
Pudina Pachadi

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టేబుల్ స్పూన్స్, శ‌న‌గ‌పప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, క‌చ్చా ప‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 5, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఇంగువ – పావు టీ స్పూన్.

పుదీనా ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా పుదీనా ఆకుల‌ను సేక‌రించి శుభ్రంగా క‌డిగి ప‌క్క‌కు పెట్టుకోవాలి. త‌రువాత ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ధ‌నియాలు, జీల‌క‌ర్ర‌, నువ్వులు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో ఎండుమిర్చిని వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత క‌రివేపాకు, మెంతులు వేసి బాగా వేయించుకోవాలి. త‌రువాత వీటిని కూడా అదే ప్లేట్ లోకి తీసుకుని ప‌క్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక పుదీనా ఆకులు వేసి వేయించుకోవాలి. పుదీనా ఆకుల్లో ఉండే నీరు అంతా పోయి ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు బాగా ఉడికించుకోవాలి. త‌రువాత ఒక జార్ లో వేయించిన ఎండుమిర్చిని, ధ‌నియాల‌ను, వెల్లుల్లి రెబ్బ‌ల‌ను, ఉప్పును వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి.

త‌రువాత వేయించిన పుదీనాను, నాన‌బెట్టిన చింత‌పండును వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు ప‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి తాళింపు చేసుకోవాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న ప‌చ్చ‌డిని వేసి క‌ల‌పాలి. ఈ ప‌చ్చ‌డిని నూనె పైకి తేలే వ‌ర‌కు బాగా వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పుదీనా ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడి అన్నం నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ చ్చ‌డి ప‌ది రోజుల వ‌రకు నిల్వ కూడా ఉంటుంది. పుదీనాతో ఇలా ప‌చ్చ‌డిని త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు.

Share
D

Recent Posts