Besan Peda : శనగపిండితో మనం రకరకాల చిరుతిళ్లను, తీపి పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. శనగపిండిని ఉపయోగించే చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. ఈ శనగపిండితో చాలా సులభంగా అలాగే తక్కువ సమయంలో అయ్యేలా మనం ఒక తీపి వంటకాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంతా రుచిగా ఉండే ఈ స్వీట్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బేసన్ పేడా తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – ఒక కప్పు, పాలు – ఒక కప్పు, ఎండు కొబ్బరి పొడి – అర కప్పు, పంచదార – ముప్పావు కప్పు, నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి – ఒక టీ స్పూన్.
బేసన్ పేడా తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో పాలు, కొబ్బరి పొడి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక కళాయిలో నెయ్యి వేసి వేడిచేయాలి. నెయ్యి వేడయ్యాక శనగపిండి వేసి కలుపుకోవాలి. శనగ పిండి మెత్తగా అయ్యి నెయ్యి పైకి వచ్చే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా వేయించిన తరువాత పంచదార వేసి కలపాలి. పంచదార కరిగిన తరువాత మిక్సీ పట్టుకున్న పాలు, కొబ్బరి పొడి మిశ్రమాన్ని వేసి కలపాలి. తరువాత యాలకుల పొడి వేసి కలపాలి. ఈ శనగపిండిని కళాయికి అంటుకోకుండా ముద్దగా అయ్యే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలిపిన తరువాత కొద్దిగా శనగపిండి మిశ్రమాన్ని తీసుకుని ఉండలా చుట్టి చూడాలి. ఉండ చేయడానికి వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
లేదంటే మరికొద్ది సేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత చేతికి నెయ్యి రాసుకుంటూ కొద్ది కొద్దిగా శనగపిండి మిశ్రమాన్ని తీసుకుంటూ పేడా ఆకారంలో వత్తుకోవాలి. తరువాత దీనిపై పిస్తా, బాదం లేదా జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బేసన్ పేడా తయారవుతుంది. ఈ స్వీట్ పది రోజుల వరకు తాజాగా ఉంటుంది. తీపి తినాలనిపించినప్పుడు లేదా పండుగలకు ఇలా బేసన్ పేడాను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.